తుంగతుర్తి నుంచి పోటీ చేయను.. తాటి పాముల అభివృద్ధి నా లక్ష్యం: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో రాష్ట్ర నీటిపారుదల, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపన చేసిన మంత్రి, అనంతరం యశ్వంతపూర్ వాగు వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాటిపాముల గ్రామంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను స్థానికులతో ఆత్మీయంగా నెమరువేసుకున్నారు.

తాను పుట్టి పెరిగిన స్వగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవడమే తన ప్రాథమిక బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి: “నేను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదు. అలాగని రాబోయే రోజుల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేయను. నేను పుట్టి పెరిగిన ఈ సొంత ఊరి ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను.”

దేవాదుల జలాలు తెస్తాం: తుంగతుర్తి నియోజకవర్గ దాహార్తిని, సాగునీటి కష్టాలను తీర్చేందుకు దేవాదుల ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందిస్తాం.

ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను నిర్మించి.. వాళ్లే కూల్చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు.

కార్పొరేట్ స్థాయి విద్య: హైదరాబాద్, సూర్యాపేట పట్టణాలకు దీటుగా తాటిపాముల గ్రామంలోనే పేద విద్యార్థులకు అంతర్జాతీయ, కార్పొరేట్ స్థాయి విద్యను అందించేలా ఆధునిక పాఠశాలల నిర్మాణం చేపడతామన్నారు.

క్షేత్రస్థాయి సంక్షేమం: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని స్పష్టం చేశారు.

గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం, పరిసర ప్రాంతాల్లోని యశ్వంతపూర్ వాగు నిర్మాణ పనులను ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి స్వయంగా పరిశీలించారు. నిర్దేశిత వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Share
Share