APB News Exclusive: ఎపిసోడ్ -1: లతీఫ్‌సాబ్‌ గుట్ట పరిధిలో రూ. 60 కోట్ల భూములు మాయం..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ ప్రభుత్వ భూముల కబ్జాకు అడ్డగా మారింది. నిన్న కతాలగూడలో ఐదెకరాలకు డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన రియల్టర్లు.. తాజాగా అత్యంత విలువైన వక్ఫ్ భూములను ఆక్రమించిన సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.  దీంట్లో రియల్టర్లు, పొలిటీషియన్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం గుట్టపైన నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న భూములను అంచనా వేసేందుకు రెవిన్యూ, వక్ఫ్ బోర్డు జాయింట్ సర్వే చేసింది. ఈ సర్వేలో సుమారు రూ.60 కోట్ల విలువ చేసే 12 ఎకరాల భూమి అన్యాక్రాంతమైన సంగతి ఆలస్యంగా బయటపడింది. ఘాట్ రోడ్డును ఆనుకుని కొత్తగా ఏర్పాటైన వెంచర్ లో వక్ఫ్ భూములు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గతేడాది జాయింట్ సర్వే చేశారు. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా లతీఫ్ సాబ్ గుట్ట పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో సుమారు 536 ఎకరాలు వక్ఫ్ బోర్డు కు చెందినవే. కానీ ఫీల్డ్ లో మాత్రం 524 ఎకరాలకు మాత్రమే లెక్క దొరికింది. మిగతా 12 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు తేలింది. అయితే ఈ 12 ఎకరాలు ఏ సర్వే నంబర్ లో తేడా వచ్చిందో కచ్చితంగా నిర్ధారణకు రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా మేరకు 779 సర్వేలో దాదాపు 316 ఎకరాలు భూమి ఉన్నది. ఈ నంబర్ లోనే 12 ఎకరాలకు లెక్కతేలడం లేదని తెలిసింది. ఘాట్ రోడ్డు పనులు మొదలు పెట్టిన ప్రాంతం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు వక్ఫ్ భూములు విస్తరించి ఉన్నాయి.. దీంట్లో 428 ఇళ్లు అక్రమంగా నిర్మించుకున్నారని తేలింది. రీసర్వే చేస్తే ఆక్రమణదారులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.

ఘాట్ రోడ్డు ఆనుకుని కొత్తగా ఏర్పాటైన వెంచర్ లో వక్ఫ్ భూములు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్డీఓ(RDO), వక్ఫ్ బోర్డు, తహాశీల్దార్ సర్వేయర్లు వక్ఫ్ భూములు ఉన్న 770, 77, 780,777,776,779, 751,774 నంబర్లలో సర్వే చేశారు. వీటిల్లో గుట్టకు నలువైపులా 779,780 సర్వే నంబర్లలోనే భూముల విస్తీర్ణంగా ఎక్కువగా ఉంది. ఘాట్ రోడ్డు నిర్మాణం 770, 771, 780, 779 నంబర్లలో జరుగుతోంది.  అయితే 779 సర్వే నంబర్ ను ఆనుకుని వెంచర్ ఉండటంతో ఆ వెంచర్లోనే 82, 820, 890 నంబర్ల లో కూడా సర్వే చేశారు. వెంచర్ లో వక్ఫ్ భూములు లేవని ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చారు. కానీ వక్ఫ్ బోర్డు కు పంపిన రిపోర్టులో మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో అనుమానం వచ్చిన బోర్డు ఉన్నతాధికారులు జాయింట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఫీల్డ్లో హద్దులు ఫిక్స్ చేయమని ఆదేశించారు. దీంతో జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు కంగుతిన్నారు. వక్ఫ్ బోర్డు మ్యాప్ ఆధారంగా ఘాట్ రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి క్లాక్ టవర్ వరకు హద్దులు ఫిక్స్ చేయగా, 12 ఎకరాలు మాయమైనట్టు తేలింది. వక్ఫ్ బోర్డు మ్యాప్ కు, జాయింట్ సర్వే రిపోర్ట్ కు తేడా ఉండటంతో మళ్లీ రీసర్వే చేయాలని బోర్డు పై ఆఫీసర్లు ఆదేశించారు. అయితే గుట్టకు నలువైపులా ఉన్నటువంటి 778,779 నంబర్లలోనే 12 ఎకరాలు తేడా రావడంతో మళ్లీ అన్ని సర్వే నంబర్లతో సహా, ఆక్రమించిన ఇళ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కూడా రీసర్వే చేయాలని జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి.

రెవిన్యూ, వక్ఫ్ బోర్డు జాయింట్ సర్వేలో తప్పు ఎక్కడ జరిగింది అనేది ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది. వక్ఫ్ బోర్డు అధికారుల పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ తో సహా, రెవిన్యూ ఆఫీసర్లు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. ఇప్పటి వరకు అమ్మగూడెం వద్ద కేటాయించిన 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోలేదు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన షాపుల అద్దెలు వసూలు చేయడం లేదు. మళ్లీ ఇప్పుడు 536 ఎకరాల్లో రీసర్వే చేయడం అంటే అంత ఆషామాషీ కాదని రెవిన్యూ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. 779, 780 సర్వే నంబర్ల పరిధిలోని భూములు క్లాక్ టవర్ వరకు విస్తరించి ఉన్నాయి. దీంట్లో రాజిరెడ్డి ఆసుపత్రి, దానికి సమీపంలోని నర్సరీ భూములు కూడా వక్ఫ్ ల్యాండ్స్ అని ఆఫీసర్లు చెప్పడం కొత్త వివాదానికి తెర తీసింది. పైగా గుట్టచుట్టు ఆక్రమించిన ఇళ్లు 12 వందలకు పైగా ఉంటాయని కార్పోరేషన్ అధికారులు అంచనా వేశారు. ఇదే సర్వే నంబర్లలో వెంచర్ల తోపాటు, గుట్టను ఆనుకుని కొందరు ఫాంహౌజ్లు కట్టుకున్నారు. అప్పటి సర్వేలో వెంచర్లో వక్ఫ్ భూములు లేవని చెప్పిన ఆఫీసర్లు మళ్లీ రీసర్వే అనడంతో ఆ వెంచర్ లో కూడా కొన్ని పాయింట్లు తేడా వస్తున్నాయని, వాటితో కలిపే అన్ని సర్వే నంబర్లలో రీసర్వే చేయక తప్పదని, జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు చెప్పడం గమనార్హం.

అధికారులు చెప్తున్నట్టు 12 ఎకరాల విలువ మార్కెట్ లో సుమారు రూ.60 కోట్లు పైమాటే. ఎకరం రూ.5కోట్లు పలుకుతోంది. కతాలగూడలోనే ఎకరం రూ.5 కోట్లు ఉందనే ఉద్దేశంతోనే రియల్టర్లు ధరణిని అడ్డంపెట్టుకుని డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ వివాదం ముగియక ముందే కొత్తగా వక్ఫ్ భూముల వ్యవహారం కొత్త చిచ్చు రాజేసింది. వక్ఫ్ భూములను కబ్జా చేసిన జాబితాలో అనేక మంది ప్రముఖులు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వక్ఫ్ బోర్డు నిర్వాహం వల్ల జిల్లా కేంద్రంలోనే కోట్ల విలువైన భూములను కబ్జా కు గురికావడం సంచలనం రేకెత్తిస్తోంది.

Share
Share