మునుగోడు ఓటుకు ఒక ప్రత్యేక ‘బ్రాండ్’ క్రియేట్ అయింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, ఏపీబీ న్యూస్: “రాష్ట్రంలో మునుగోడు ఓటుకు ఉన్న విలువ, డిమాండ్ మరెక్కడా లేదు. ఇతర ప్రాంతాలలో ఓట్లు ఉన్నప్పటికీ మునుగోడులోనే తమ ఓటు హక్కును ఉంచుకోవాలనేలా ఇక్కడ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ అయింది” అని మునుగోడు శాసనసభ్యులు శ్రీ Komatireddy Rajgopal Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ (బిఎల్ఏ) విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.

ఈనెల జూన్ 25 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R) ప్రక్రియపై ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.

సమావేశంలో క్షేత్రస్థాయి ఏజెంట్లను ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, అలా ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు. ఓటు అనేది సామాన్యుడి చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదన్నారు.

రాబోయే ఓటర్ల సమగ్ర సవరణ (SIR) సర్వే విషయంలో ఏ ఒక్కరూ కూడా బాధ్యతారాహిత్యంగా ఉండవద్దని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించబడకుండా బీఎల్ఏలు అత్యంత సీరియస్గా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలనలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీపీసీసీ (TPCC) నియమించిన మాస్టర్ ట్రైనర్ నుమాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా వివరించారు:

ఓటర్ల మ్యాపింగ్: మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మ్యాపింగ్ అయిన ఓటర్లు, అన్-మ్యాపింగ్ అయిన ఓటర్ల వివరాలను స్క్రీన్పై ప్రదర్శించారు.

జాగ్రత్తలు: అర్హులైన స్థానిక ఓటర్ల ఓట్లను రాజకీయ కక్షలతో ఎవరూ తొలగించకుండా తీసుకోవాల్సిన చట్టపరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

కొత్త ఓటర్ల నమోదు: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

సందేహాల నివృత్తి: సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఏలకు ఎదురయ్యే పలు సాంకేతిక సందేహాలను మాస్టర్ ట్రైనర్ నుమాన్ సుదీర్ఘంగా చర్చించి నివృత్తి చేశారు.

ఈ నల్లగొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ మాట్లాడుతూ కీలక గణాంకాలను వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్-మ్యాపింగ్ ఓట్లతో కలుపుకొని, వివిధ రకాల మార్పులు, చేర్పులు, మరియు తప్పులు ఉన్న ఓటర్ల సంఖ్య దాదాపు 91 వేల వరకు ఉందని ఆయన తెలిపారు. ఈ భారీ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి, ఒక్క దొంగ ఓటును కూడా రానివ్వకుండా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందేలా సర్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఈ ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలతో పాటు, మున్సిపాలిటీల చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, అనుబంధ సంఘాల నాయకులు మరియు ముఖ్య ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share
Share