Breaking News: ఇప్పటికిప్పుడు ఎన్నికలైనా కేసీఆర్ సీఎం కావడం పక్కా: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

దేవరకొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం రాజకీయంగా తీవ్ర వేడి పుట్టించింది. ఓటర్ల సర్ (SIR) ప్రక్రియ, పార్టీ డిజిటల్ సభ్యత్వాల నమోదు కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించబోతోందని అన్ని అంతర్గత సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. మళ్లీ ఇక్కడ గెలిచేది కార్ గుర్తు మాత్రమేనని కార్యకర్తల్లో జోష్ నింపారు.

సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర విసుగు చెందారని మండిపడ్డారు. “తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు ఐదు నెలలకే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుంది. ఇది వంద శాతం పక్కా” అని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై జగదీష్ రెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు:

అసమర్థ సీఎం: చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీలు ఇద్దరూ కలిస్తే వచ్చిన ఒక ‘హైబ్రిడ్ ముఖ్యమంత్రి’ ఈ రేవంత్ రెడ్డి. దేశంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు.

వ్యవస్థల దుర్వినియోగం: అధికారులు నా మాట వినడం లేదు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా అనడం ఆయన చేతకానితనానికి నిదర్శనం. రేవంత్.. ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదా? కమిషన్ల దందాలు చేసుకునేందుకు నువ్వు వ్యవస్థలను వాడుకుంటుంటే నిన్ను అధికారులు ఎందుకు లెక్కచేస్తారు? అందుకే నీకు సీఎం కుర్చీలో కనీస విలువ లేకుండా పోయింది. నువ్వొక రెన్యూవల్ ముఖ్యమంత్రివి మాత్రమే.

హిట్లర్ పోకడలు: ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ను ఆదర్శంగా చెప్పుకునే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇద్దరూ లోపల ఒక్కటే ఉంటూ, బయటకు మాత్రం డ్రామాలు ఆడుతూ తిట్టుకుంటున్నారని విమర్శించారు. ఈ రాజకీయ డ్రామాలో భాగంగానే మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణను పవర్ఫుల్ రాష్ట్రంగా మార్చి కరెంట్ కోతలు లేకుండా చూశారన్నారు. కానీ, ఈరోజు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ను కూడా ప్రజలకు సక్రమంగా ఇవ్వలేకపోతున్న ఈ దుర్మార్గుల పరిపాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పార్టీ డిజిటల్ సభ్యత్వాలను విజయవంతం చేసి, గ్రామగ్రామాన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ నియోజకవర్గ స్థాయి సమావేశంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

Share
Share