- ‘ఆడియో లీక్’ ఫేక్ అంటూ క్రమశిక్షణ కమిటీకి మాజీ మంత్రి వివరణ..
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అతని కుమారుడు ఇలియాస్తో పాటు 10 మందిపై ఎస్పీకి కంప్లైంట్!
- సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆగ్రహం!
- తిరిగి పోలీసులను ఆశ్రయించిన షబ్బీర్ వర్గం.. కామారెడ్డి లీడర్ల తీరుపై తలపట్టుకుంటున్న అధిష్టానం!
కామారెడ్డి, ఏపీబీ న్యూస్: అధికార కాంగ్రెస్ పార్టీలో లీడర్ల మధ్య ఉన్న విభేదాలు కామారెడ్డి నియోజకవర్గంలో రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకునే స్థాయికి వివాదం ముదరడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ రెడ్డి.. సీనియర్ నేత షబ్బీర్ అలీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు సంచలన ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా ట్రోలింగ్ – ఇందుప్రియ రెడ్డి ఫైర్:
గడ్డం ఇందుప్రియ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా, అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్య నేతలపై ఫిర్యాదు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆయన కుమారుడు ఇలియాస్, అన్న కొడుకు షేర్ ముక్తార్, పర్వేజ్లతో పాటు దాదాపు 10 మంది షబ్బీర్ అలీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తిరిగి కౌంటర్ కంప్లైంట్: ఈ పరిణామాలపై షబ్బీర్ అలీ వర్గం కూడా తక్షణమే స్పందించింది. కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐరేని సందీప్ కుమార్, అభ్యర్థులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మరియు మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలపై తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఆడియో లీక్ కలకలం – ఏఐసీసీ (AICC) నోటీసులపై షబ్బీర్ అలీ వివరణ:
ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో పదవులు, మహిళా నేతల వ్యవహారాలపై షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీనిపై ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ (Disciplinary Committee) సీరియస్ అవుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఆదివారం షబ్బీర్ అలీ 3 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
“నా పేరు మీద లీక్ అయిన ఆడియో క్లిప్ ముమ్మాటికీ ఫేక్, కల్పితమైనది. ఆధునిక సాంకేతికతను (AI / Morphing) ఉపయోగించి, నా వాయిస్ను మార్ఫింగ్ చేసి సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలో నాకున్న 45 ఏళ్ల రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పార్టీలో అంతర్గత అపనమ్మకాన్ని సృష్టించేందుకు కొందరు కుట్రపూరితంగా ఈ పని చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పై కానీ, కాంగ్రెస్ మహిళా నేతలపై కానీ నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. క్రమశిక్షణా కమిటీ వివరణ కోరడానికి ముందే.. ఈ ఫేక్ ఆడియో సృష్టికర్తలపై క్రిమినల్ డెఫమేషన్ కేసు నమోదు చేయాలని నా అనుచరులతో కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయించాను.” – మహమ్మద్ అలీ షబ్బీర్, కాంగ్రెస్ మాజీ మంత్రి & ప్రభుత్వ సలహాదారు
అధిష్టానం సీరియస్ – నష్ట నివారణ చర్యలు:
కామారెడ్డి కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి వర్గానికి, షబ్బీర్ అలీ గ్రూపునకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న పరిస్థితులపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే.. నియోజకవర్గ స్థాయి నేతలు ఇలా రచ్చకెక్కడం పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోందని హైకమాండ్ భావిస్తోంది. ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడేందుకు పీసీసీ నేతలు సిద్ధమవుతున్నారు.