గర్జించిన నల్లగొండ: ‘పాంచజన్యం’ ఐదు సూత్రాలతోనే మన పోరాటం: కల్వకుంట్ల కవిత

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ అంటేనే మేధావులకు, విప్లవాలకు అడ్డా అని, అందుకే రాష్ట్రంలోని రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాము ఈ చైతన్యవంతమైన జిల్లానే ఎంచుకున్నామని తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతాంగ సమస్యలపై నిర్వహించిన భారీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కవిత గారు ఆవేదన వ్యక్తం చేశారు.

పుస్తెలు తాకట్టు పెడుతున్న పరిస్థితి: మృగశిర కార్తె దాటి రైతులు కొత్త పంట ఏర్పాట్లు చేసుకుంటున్నా, ప్రభుత్వం ఇప్పటివరకు ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం వేయలేదన్నారు. దీంతో రైతులు పెట్టుబడి కోసం బంగారాన్ని, మంగళసూత్రాలను తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని, రుణమాఫీ సగం మందికి కూడా చేయలేదని దుయ్యబట్టారు. కేవలం జడ్పీటీసీ ఎన్నికల కోసమే రైతు భరోసాను ఆపుతున్నారని ఆరోపించారు.

మొలకెత్తిన ధాన్యం – రైతుల కన్నీళ్లు: 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. రవాణా భారాన్ని రైతులపైనే వేసిందని విమర్శించారు. తాము వస్తుండగా సంస్థాన్ నారాయణ్ పూర్ వద్ద కొనుగోళ్లు జరక్క ధాన్యం మొలకెత్తిపోవడాన్ని చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. పైగా క్వింటాకు 6 కిలోల తరుగు పేరిట అన్నదాతలను అరిగోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖపై సమీక్ష (Review) చేయలేదని, సీఎం పర్యవేక్షణ లేకపోతే అధికారులకు భయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం తెరవెనుక పక్కా స్కెచ్ వేస్తోందని కవిత గారు సంచలన ప్రకటన చేశారు. “రైతు డిస్కం” పేరుతో ఒక విద్యుత్ పంపిణీ సంస్థను ప్రైవేటీకరిస్తూ, ఉచిత కరెంట్కు చెల్లుచీటి పాడేందుకు ఎవరితోనూ చర్చించకుండా ఈఆర్సీ (ERC) కి అప్లికేషన్ పెట్టుకున్నారని, పబ్లిక్ హియరింగ్తోనే ఈ దొంగ వ్యవహారం బయటపడిందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ తిరగబడాలని పిలుపునిచ్చారు.

అసైన్డ్ భూములకు రైట్స్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఇండస్ట్రీస్ పేరుతో వాటిని లాక్కుంటోందని కవిత ఆరోపించారు. “నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రి హైదరాబాద్ పరిసరాల్లో ఏకంగా 200 ఎకరాల అసైన్డ్ భూములను కొని పెట్టుకున్నారు. చాలా మంది మంత్రులు ఇదే దందా చేస్తున్నారు. ఎన్నికల చివరి సంవత్సరంలో అసైన్డ్ భూములకు పర్మిషన్లు ఇచ్చుకుని భారీగా లాభపడాలనేది వీరి ప్లాన్” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

నల్లగొండ జిల్లాలో రిజర్వాయర్లు లేక రైతులు మినిమం గ్యారంటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు తేవాల్సి ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా నల్లగొండకు నీళ్లివ్వకుండా సీఎం కేవలం పాలమూరు గురించే మాట్లాడుతున్నారని, దిండి ప్రాజెక్ట్ సోర్స్ పాయింట్ మార్చకపోతే మహబూబ్ నగర్, నల్లగొండ మధ్య గొడవలు ఖాయమన్నారు.

తమది కొత్త పార్టీ అయినప్పటికీ.. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుకు గౌరవం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం అనే “పాంచజన్యం” ఐదు ప్రధాన ప్రాధాన్యతలతో చరిత్రను తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ వద్ద ధాన్యం పోసి ఆందోళన చేసినా కదలని ఈ ప్రభుత్వం దిగిరావాలంటే రోడ్డెక్కి పెద్ద ఎత్తున పోరాటం చేయక తప్పదన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సర్కిల్ వద్దకు చేరుకున్న కవిత.. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో క్లాక్ టవర్ సర్కిల్లో తెలంగాణ రక్షణ సేన (TRS) గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇస్మాయిల్, స్థానిక ప్రతినిధులు, డ్రైవర్లు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share
Share