APB News Exclusive: జాన్ పహాడ్ దర్గా దోపిడీకి ఏసీబీ(ACB) చెక్..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా దోపిడీకి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చెక్ పెట్టింది. శనివారం మిర్యాలగూడెం ఆర్టీసీ బస్టాండ్ లో పట్టుబడ్డ ఉమ్మడి జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ అరెస్ట్ డిపార్ట్మెంట్ లో కలంకలం రేపింది. సుదీర్ఘకాలంగా ఒక చోట పని చేస్తున్న మహమ్మద్ పనితీరు పైన గతంలోనే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాలో చోటు చేసుకునే అక్రమాల్లో ఇన్స్పెక్టర్ ప్రమేయం ఉందనే ఆరోపణలు గతంలో వచ్చాయి. దీంతో ఆయన పైన బోర్డు సీఈఓ(CEO)కు అనేక మంది ఫిర్యాదులు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్నటి వరకు మేడ్చల్ జిల్లా ఇంచార్జిగా కూడా పనిచేశారు. ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక్కడే ఆఫీసర్ కావడం, ఇతని పరిధిలో పన్నులు వసూలు చేసేందుకు నల్లగొండలో ఒక్కరే సిబ్బంది ఉండటంతో ఇన్స్పెక్టర్ కు భారీగా కలిసొచ్చింది.

రెండేళ్ల క్రితం వరకు జాన్ పహాడ్ దర్గా వద్ద భక్తులు తీర్చుకునే మొక్కల నుంచి టెండర్ల వరకు అన్నింటిని స్థానికంగా ఉండే ఒకే కాంట్రాక్టర్ కు వేలం ద్వారా అప్పగించడం జరిగింది. గత రెండేళ్ల నుంచి వాటన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చింది. ప్రతి ఏడాది ఉర్సు ఉత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం సుమారు రూ.30లక్షల వరకు వస్తోంది. హుండీకి సీల్ లేకపోవడంతో దాతలు ఇచ్చిన విరాళాలు, కానుకులు సైతం వదిలి పెట్టకుండా స్వాహా చేసే వారని స్థానికులు చెప్పారు. అంతేగాక ప్రతి శుక్రవారం మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశారు. జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆధీనంలోనే దర్గా ఉండటంతో వచ్చే ఆదాయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దర్గా సిబ్బంది కుమ్మకై లక్షల సొమ్ము స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ పైన చర్య లు తీసుకోవాలని మత పెద్దలు, ముస్లీం మైనార్టీ లీడర్లు సీఈఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కానీ అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతల సపోర్ట్ బలంగా ఉండటంతో సుమారు ఐదారేళ్ల నుంచి ఇక్కడే తిష్ట వేశాడు.

ఇటీవల జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మహమూద్ ను గట్టిగానే మందిలించినట్టు తెలిసింది. నల్లగొండ లతీఫ్ సాబ్ గుట్ట భూముల సర్వేలో కూడా భారీ చేతి వాటాన్నే ప్రదర్శించినట్టు తెలిసింది. సుమారు రూ.60 కోట్ల విలువ చేసే 12 ఎకరాల భూమి కబ్జాకు గురైందని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా వ్యవహారిస్తున్న ఆర్డీఓ(RDO) పంచనామా రిపోర్ట్ ను కూడా తొక్కిపట్టినట్టు తెలిసింది.

పెద్దవూరలోని మసీదుకు సంబంధించిన 996.33 గజాల స్థలంను గతంలో దాతలు మసీదు నిర్మాణం కోసం ఇచ్చారు. ప్రస్తుతం భూముల రేట్లు పెరగడంతో దాతల వారసులు తమ భూమి కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా, దాతలు ఇచ్చిన భూమి వక్ బోర్డు కు లేదా మసీదుకు చెందాలని అన్యాక్రాంతం కావద్దు అని మసీదు నిర్వాహకుడు వక్ బోర్డు కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయములో వక్ బోర్డు అధికారులు విచారణ చేస్తున్న క్రమంలో దాతల భూమి మసీదుకు అనుకూలంగా రిపోర్టు రాయాలి అంటే డబ్బులు ఇవ్వాలని ఇన్స్పెక్టర్ మహమూద్ డిమాండ్ చేయగా మసీదు నిర్వాహకుడు ఏసీబీ(ACB)ని ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ డీఎస్పీ(DSP) జగదీష్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ బస్టాండులో మహమూద్ కు రూ.10వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  మిర్యాలగూడలోని మందుల వారి కాలనీలోని ఆయన నివాసంలో, కలెక్టరేట్ ఆఫీసులో అధికారులు సోదాలు నిర్వహించారు.

Share
Share