- డీలిమిటేషన్ తో మారిన మండలి చైర్మన్ గుత్తా మనసు
- అత్యవసరమైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన
- నియోజకవర్గాలు పెరిగితే ఎమ్మెల్యే లేదా ఎంపీకి పోటీ
- కొత్త నాయకత్వాన్ని సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం
- 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వృథా కానివ్వ
- నీలం సంజీవరెడ్డి, పీవీ నర్సింహారావులే ఆదర్శం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్లీ మనసు మార్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన సుఖేందర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. తన 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని వృథా కానివ్వని, కొత్తగా వస్తున్న రాజకీయ తరాన్ని సన్మార్గంలో నడిపించాలంటే తనలాంటి వాళ్లు రాజకీయాల్లో కొనసాగడం ఎంతైన అవసరమని నొక్కి వక్కాణించారు. బుధవారం నల్లగొండలో మీడియాతో చిట్ చాట్ చేసిన గుత్తా తన భవిష్యత్తు రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన కొడుకు అమిత్ పోటీ చేస్తాడని కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా చెప్పిన గుత్తా మళ్లీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. పీవీ నర్సింహారావు, నీలం సంజీవ రెడ్డిలే తనకు ఆదర్శమని చెప్పారు. రాజకీయాలు వద్దని తట్టబుట్టా సర్ధుకుని ఇంటిబాట పట్టిన పీవీకి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం కలిసొచ్చిందని, దాంతోనే దేశంలో ఆర్ధిక సంస్కరణలకు బీజం పడిందని చెప్పిన గుత్తా రాజకీయాలకు దూరమైన నీలం సంజీవ రెడ్డికి సైతం రాష్ట్రపతి పదవి వరించిందని గుర్తు చేశారు.
కొందరికి బ్రేక్లు వేయాలంటే తప్పదు….
రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కొత్త తరాన్ని సన్మార్గంలో నడిపించాలంటే తనలాంటి వాళ్ల అవసరం ఉందని చైర్మన్ గుత్తా చెప్పారు. వార్డు సభ్యుడి నుంచి మొదలైన తన రాజకీయ ప్రస్థానం పార్లమెంట్ వరకు కొనసాగిందని, గ్రూపు రాజకీయాలు, నక్సలైట్ల దాడులు వంటి ఎన్నో ఎత్తు పల్లాలు దాటుకుని ఈ స్థాయికి చేరిన నేను రాజకీయాలకు దూరంగా ఉండటం కరెక్ట్ కాదనిపిస్తోందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్ధికంగా బలమైన కుటుంబాలు, రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న వాళ్ల వైఖరి మరోరకంగా ఉంటోందని, వాళ్లంతా చెడ్డవాళ్లు కాకపోయినా, వక్రమార్గంలోకి వెళ్లకుండా బ్రేక్లు వేసి, సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తమలాంటి వాళ్లపైన ఉందని అన్నారు.
పున:ర్విభజనతో చిగురించిన గుత్తా ఆశలు..
నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు పడుతున్న తరుణంలో సుఖేందర్ రెడ్డి ఆశలు మళ్లీ చిగురించాయి. వచ్చే ఏడాది నవంబర్ లో ఎమ్మె ల్సీ పదవి కాలం పూర్తివుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునేందుకు వ్యూహాం రూపొందిస్తున్నారు. పైగా గుత్తాకు టీడీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే అన్ని రకాలుగా కలిసొచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి టర్మ్, మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి టర్మ్లోనే తండ్రికొడుకులిద్దరికి రాజకీయ బలం చేకూరింది, కానీ పార్లమెంట్ సభ్యుడిగా విశిష్ట సేవలు అందించిన గుత్తాకు ఎమ్మెల్యే కావాలనే కోరిక మాత్రం తీరలేదు. నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. డీలిమిటేషన్ తో నల్లగొండ జిల్లాలో కొత్తగా ఆరు నియోజకవర్గాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ స్థానాలు కూడా ఒకటి, రెండు పెరిగే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు కలిపి ఒకటి, రెండు ఎంపీ సీట్లు పెరగొచ్చని గుత్తా చెప్తున్నారు. నియోజకవర్గాల పెంపుతో నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ రూపురేఖలు మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు జరిగినా సుఖేందర్ రెడ్డి ఆశలు నెరవేరినట్టే. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి కావాలనే కోరిక నియోజకవర్గాల పునర్విభజనతో తప్పక నెరవేరుతుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.