- తమ వర్గాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల కుస్తీ
- ఇదే చివరి ఛాన్స్.. మిస్సైతే తాడోపేడో
- కార్పోరేషన్ చైర్మన్ పదవులతో సహా, డీసీసీబీ(DCCB) పైన కన్ను
- ఐదు నియోజకవర్గాల్లో ఆశావహుల పోటీ
- రేసులో ఎమ్మెల్యే పద్మావతి, మరికొంత మంది సీనియర్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేందుకు ఆశావహుల నడుమ బిగ్ ఫైట్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తియినా ఇప్పటి వరకు పదవులు రాకపోవడంతో కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. తొలి రెండేళ్లు పదవులు అనుభవించిన చైర్మన్ ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రెండో జాబితా పైన తీవ్ర కసరత్తు జరుగుతోంది. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పీసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఆశావహులు పట్టుబిగిస్తున్నారు. ఇప్పుడు అవకాశం చేజారితే మళ్లీ పదవులు దక్కడం కష్టమని భావించిన వారంతా మంత్రులు, ఎమ్మెల్యేలతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే దక్కాల్సిన పదవులు ఎమ్మెల్యేలు, మంత్రుల అలసత్వం వల్ల చేజారిపోయాయి, దాంతో ఈసారి పదవుల కోసం పైస్థాయిలో గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. మూడేళ్ల అధికారమే మిగిలి ఉన్నందున ఈ దఫా సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని చాలెంజ్ చేస్తున్నారు.
పేట జిల్లా నుంచి ఎమ్మెల్యే పద్మావతి..
కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న జాబితాలో అగ్రనేతల అనుచరులే ఉన్నందున ఉత్కంఠ నెలకొంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎమ్మెల్యే నలమాద పద్మావతి కేబినెట్ హోదా కోసం కార్పోరేషన్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డి పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నందున ఈసారి సర్వోత్తమ్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది. మంత్రి ఉత్తమ్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. నిజానికి లక్ష్మీనారాయాణ రెడ్డికి ఎప్పుడో దక్కాల్సిన పదవి సమీకరణాలు కుదరక ఆలస్యమవుతోంది.



జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వర్గం..
నల్లగొండ జిల్లాలో సీనియర్ నేత జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వర్గీయులకు మధ్య పోటీ నడుస్తోంది. నకిరేకల్ ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన జానారెడ్డి ప్రధాన అనుచరుడు పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పెద్దవూర మాజీ జడ్పీటీసీ(ZPTC) సీనియర్ నేత కర్నాటి లింగారెడ్డి, మంత్రి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు మాజీ జడ్పీటీసీ(ZPTC) గుమ్మల మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. మల్లయ్యకు కార్పోరేషన్ పదవి ఇవ్వాలని జానారెడ్డి అధిష్టానం వద్ద గట్టిగానే ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్యే జైవీర్, ఎంపీ రఘువీర్ సైతం మల్లయ్య పేరును పీసీసీకి సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఒకవేళ మల్లయ్యకు అవకాశం ఇస్తే లింగారెడ్డికి వచ్చే ఏడాది ఖాళీ అయ్యే లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోటాలో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో పదవుల పైన ఆశలు పెట్టుకుని నిరాశ చెందిన మోహన్ రెడ్డి ఈసారి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారు. మంత్రి వెంకటరెడ్డి సీఎంతోనే డైరక్ట్ హామీ ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి మోహన్ రెడ్డి కి డీసీసీ(DCC) లేదా ఆయన భార్యకు నల్లగొండ మేయర్ దక్కాల్సి ఉంది, కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి.



డీసీసీబీ పీఠం పైనా ఫోకస్..
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (డీసీసీబీ) చైర్మన్ పీఠం పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాల పాలకవర్గాలను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి డీసీసీబీ పైనే పడింది. గత చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టి నిర్ణయం మేరకే డీసీసీబీ పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తే చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి, కాకపోతే ఏడాదిన్నర మాత్రమే డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ఈసారి పూర్తిస్థాయి పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా మంత్రి వెంకటరెడ్డి అనుచరుడైన మోహన్ రెడ్డికి కార్పోరేషన్ పదవి మిస్సైతే డీసీసీబీ రేసులోకి రావొచ్చు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి సైతం చైర్మన్ రేసులో ఉన్నారు. కోదాడ సీనియర్ నేత చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ భర్త బచ్చుపల్లి గంగాధర్ రావు రేసులో ఉన్నారు. వెలమ కోటాలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వలేదు.



కుల సంఘాల తర్వాతే కార్పోరేషన్లు..
త్వరలో ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో తొలుత కుల సంఘాల వరకే పరిమితం చేస్తారని తెలుస్తోంది. అంటే వడ్డెర, బ్రహ్మణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలకు చెందిన కార్పోరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేస్తారని, మళ్లీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయ్యాక కార్పోరేషన్ చైర్మన్ పదవుల జోలికి వెళ్తారని అంటున్నారు. జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, సొసైటీలు, డీసీసీబీ పదవుల్లో కొంతమంది ఆశావహులను భర్తీ చేస్తే కార్పోరేషన్ చైర్మన్లకు పోటీ తగ్గుతుందని, బ్యాలెన్స్ ప్రభుత్వ కార్పోరేషన్లో భర్తీ చేయోచ్చని అధిష్టానం ఆలోచిస్తోంది.