APB News Exclusive: పొలిటికల్ పార్టీల్లో గ్రాడ్యుయేట్ వేడీ..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల నగారా మోగింది. గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదు కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను హైకమాండ్ పరిశీలిన చేస్తోంది. కాంగ్రెస్ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, చనగానికి దయాకర్ పేర్లు పార్టీ పరిశీలిస్తోంది. కాగా, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాణి రుద్రమదేవి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సారి తొలిసారిగా పీఆర్టీయూ టీఎస్(PRTUTS) రంగంలోకి దిగింది. ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండకు చెందిన సుంకరి భిక్షంగౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించారు.

గత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజశ్వరరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 2015 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి రావడంతో రాజేశ్వరరెడ్డి రాజీనామాతో 2024లో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 ఎన్నికల్లో ఓడిపోయిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)2024 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ గురువారం ఓటరు జాబితా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28 నుంచి నవంబర్ 6 తేదీ వరకు కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలి. నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు ముసాయిదా ఓటరు జాబితా పైన అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర 30న తుది ఓటరు జాబితా వెల్లడిస్తారు. మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తారు.

ఉప ఎన్నికల్లో కోల్పోయిన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారని, మూడేళ్ల ప్రజాపాలనతో విసుగుచెందారని బీఆర్ఎస్ భావిస్తోంది. పైగా రాకేష్ రెడ్డి గతంలో ఓడిపోయిండన్న సానుభూతి ఈ ఎన్నికల్లో బలంగా పనిచేస్తుందని నమ్ముతోంది. అంతేగాక 2021 లో బీఆర్ఎస్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే ప్రత్యర్థులతో బలంగా ఢీకొట్టింది. ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్, రాణిరుద్రమ, చెరుకు సుధాకర్ వంటి హేమాహేమీలతో కలిపి సుమారు 50 మందికి పైగా పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే పల్లా రాజేశ్వరరెడ్డి అండ్ టీమ్ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేల ఆఫీసుల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. దాంతో 2015తో పోలిస్తే 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లు నమోదయ్యారు. అనురాగ్ టీమ్ పూర్తిగా ఎన్నికల నిర్వహణను తమ కంట్రోల్కి తీసుకోవడంతో ఆ ఎన్నికల్లో రాజేశ్వరరెడ్డి గట్టెక్కారు. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉండటంతో రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఏ మేరకు సహరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాకేష్ రెడ్డి మాత్రం ఒంటిరిగానే పోరాడుతున్నారు. అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలతో చర్చించి నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి మరోసారి అగ్నిపరీక్ష ఎదురైంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన ఆపార్టీ ఉప ఎన్నికల్లో గట్టెక్కింది. 2015 లో కాంగ్రెస్ మద్ధతుతో పోటీచేసిన తీన్మార్ మల్లన్న 2021లో అదేపార్టీ సపోర్ట్ తో పోటీ చేసి బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చారు. రెండుసార్లు ఓడిపోయిన మల్లన్నకు మూడోసారి విజయం వరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ తో పోటీచేస్తున్నట్టు ప్రకటించిన మల్లన్న పార్టీకి మూడు కోట్ల విరాళం కూడా ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ అయ్యాక ఆయనే సొంతంగా పార్టీ పెట్టు కోవడం, బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఉప ఎన్నికల్లో సొంత పార్టీ నేతలతో తనను మోసం చేశారని, నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వ్యతిరేకంగా పనిచేసిందని ఎదురుదాడికి దిగారు. దాంతో మొదలైన అసంతృప్తి తీవ్రరూపం దాల్చింది.

ఇప్పుడు ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో గుత్తా అమిత్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, ఒకరిద్దరు బీసీల పేర్లను పరిశీలిస్తోంది. అయితే ఈ మూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు, జాబ్ మేళాలు, నోటిఫికేషన్లు ఈ ఎన్నికల్లో తమకు కలిస్తొయాని భావిస్తోంది. బలమైన అభ్యర్థి లేకపోవడంతో అమిత్ రెడ్డి లాంటి వ్యక్తులను నిలబెట్టాలని ఆలోచిస్తోంది. తద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఒకే వర్గం అభ్యర్థులు పోటీ చేయడం, పైగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మూడు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు చాలెంజ్ గా తీసుకుంటే తప్పా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకునే పరిస్థితులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెడ్డి అభ్యర్థులను నిలబెడితే బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తోంది. గత రెండు ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆయన ప్రభావం నిరుద్యోగల పైన కనిపించలేదనే అభిప్రాయాన్ని ఆలస్యంగా గుర్తించింది. దీంతో ఈసారి బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అయితే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం పైన బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అక్కడ బీజేపీ బలంగా ఉన్నందున నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానం పైన బీసీ అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటాలని అనుకుంటోంది. భువనగిరి మాజీ బూర నర్సయ్యగౌడ్ పేరును పార్టీ పరిశీలిస్తోంది. ఆర్ధిక అంశాలు కూడా ముడిపడి ఉన్నందున పార్టీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

Share
Share