- 10 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వకపోతే పాదయాత్ర చేస్తా: మిర్యాలగూడ రైతు ధర్నాలో కేటీఆర్ హెచ్చరిక
- నాగార్జునసాగర్‌లో నీళ్లున్నా ఎడమకాలువకు విడుదల చేయట్లేదు..
- మంత్రి ఉత్తమ్‌కు సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
మిర్యాలగూడ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ ‘వెయ్యి రోజుల’ దుష్ట పాలనలో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, నాగార్జునసాగర్ జలాశయంలో పుష్కలంగా నీళ్లున్నా ఎడమకాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం పగపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిర్యాలగూడలో నిర్వహించిన భారీ ‘రైతు మహాధర్నా’లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలన, మంత్రుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు అనుమతులు నిరాకరించినా, అనేక కుట్రలు పన్నినా వేలాదిగా తరలివచ్చిన రైతులతో మిర్యాలగూడ జనసంద్రంగా మారింది.
10 రోజుల గడువు.. లేదంటే కోదాడ–హాలియా పాదయాత్ర!
మిర్యాలగూడ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ 10 రోజుల సమయం విధించారు.
కేటీఆర్ డిమాండ్లు – సంచలన వ్యాఖ్యలు:
నీటి విడుదల షెడ్యూల్: సెప్టెంబర్ 14న వినాయకచవితిలోగా సాగర్ ఎడమకాలువ కింద ఉన్న పంట పొలాలకు ఎన్ని తడులు, ఎప్పుడెప్పుడు నీళ్లు ఇస్తారో స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలి.
కోదాడ – హాలియా పాదయాత్ర: ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు లేదా హాలియా నుంచి కోదాడ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.
ఉత్తమ్‌కు సవాల్: “సాగర్‌లో నీళ్లున్నాయో లేదో తేల్చుకుందాం.. ధైర్యముంటే ఇద్దరం కలిసి సాగర్ నీళ్లలో దూకుదాం” అంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు.
3 సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు!
కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ దేశానికే ధాన్య భాండాగారంగా మారిందని, మిర్యాలగూడ ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’గా వెలిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టి రైతులను నిలువునా ముంచిందని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదని, క్వింటాలుకు రూ.500 బోనస్ హామీ ఏమైందని నిలదీశారు.
చంద్రబాబుకు గురుదక్షిణగా నీళ్లు ఇస్తున్నారా?
శ్రీశైలంలో 537 అడుగుల నీరు, సాగర్‌లో 180 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు నీరివ్వకుండా ఏపీలోని ప్రాజెక్టులకు, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలిస్తున్నారని ఆరోపించారు. “చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికే రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల కడుపు కొట్టి ఏపీకి నీళ్లు వదులుతున్నారా?” అని ఘాటుగా ప్రశ్నించారు.
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనూ, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని, రైతులకు నీళ్లు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.