APB News Exclusive: నకిరేకల్లో.. శిఖం భూములపై ‘పెద్దల’ ఒత్తిళ్లు?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శిఖం భూముల వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విలువైన భూములపై ‘పెద్దల’ కన్ను పడిందనే ప్రచారం.. రెవిన్యూ రికార్డుల్లో శిఖం భూముల వివరాల విషయం లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత, రెవిన్యూ అధికారుల మధ్య తలెత్తిన విభేదాలు.. వెరసి ఈ వ్యవహారం రచ్చ కెక్కినట్లు తెలుస్తోంది.రెవిన్యూ రికార్డుల్లో ఉన్న ‘శిఖం’ అనే పదాన్ని తొలగించి, తాను సూచించిన విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, చెప్పినట్టు నడుచుకుంటే భవిష్యత్ లో తమ ఉద్యోగాలకే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనతో అధికారులు వెనుకడుగు వేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలోనే నకిరేకల్ తహశీల్దార్పై బదిలీ వేటు పడినట్లు చర్చ సాగుతోంది. ముఖ్యనేత సూచనలకు అనుగుణంగా వ్యవహరించకపోవడమే ఇందుకు కారణమన్న ప్రచారం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. తహశీల్దార్ వెళ్లిపోవడంతో డిప్యూటీ తహశీల్దార్కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. మొదట్లో ముఖ్యనేతకు సన్నిహితంగానే మెలిగిన డిప్యూటీ తహశీల్దార్కు శిఖం భూముల వ్యవహారం విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రికార్డుల్లో మార్పులు చేస్తే భవిష్యత్లో న్యాయపరమైన, ఉద్యోగపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న ఆందోళనతో ఆయన కూడా సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఒకరి తర్వాత మరొకరు రెవిన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నకిరేకల్ రెవిన్యూ కార్యాలయంలో ప్రస్తుతం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ రెండు కీలక పోస్టులు ఖాళీగా ఉండటం చర్చనీయాంశమైంది.

నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని భావిస్తే అధికారులు ఎవరూ సహరించట్లేదని సదరు ముఖ్యనేత ఉన్నతాధికారుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. శిఖం భూముల గొడవ గురించి డెప్యూటీ తహాశీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే సదరు ముఖ్యనేత స్వయంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి నకిరేకల్ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని గట్టిగానే మందలించినట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదస్పదంగా మారడంతో ఇటీవల సూర్యాపేటకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు శిఖం భూముల పంచాయితీ చేరింది. నకిరేకల్ లో కొత్తగా నిర్మించిన వందపడకల ఆసుపత్రి పక్కనే ఇంకొంత జాగ ఖాళీగా ఉంది. ఈ స్థలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టాలన్నది ముఖ్యనేత ఆలోచన. అయితే రెవిన్యూ రికార్డుల్లో ఈ భూములు శిఖం అని ఉన్నందున అదే విషయాన్ని డెప్యూటీ తహాశీల్దార్ రిపోర్ట్ లో ప్రస్తావించడం ముఖ్యనేతకు కోపం తెప్పించింది. ఇప్పుడున్న నకిరేకల్ స్టేడియం, కోర్టు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ శిఖం భూముల్లోనే నిర్మించారని, ఆ భూములకు లేని అడ్డంకులు, దీనికి ఎట్లా వస్తుందని ముఖ్యనేత వాధించారు. కానీ కొత్తగా వచ్చిన సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు శిఖం భూముల విషయంలో ఎలాంటి ప్రకటన చేయాలన్న ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. కేబినెట్ అప్రూవల్ తీసుకున్నాకే శిఖం భూములను ఆయాన్ భూములుగా ప్రకటిస్తారు. అంటే శిఖం భూముల్లో ఇప్పుడు నీటి పారుదల లేదని, నిరుపయోగంగా ఉన్నాయని కేబినెట్ తీర్మానించిన తర్వాత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం జరగాల్సిన ఈ వ్యవహారంలో రెవిన్యూ ఆఫీసర్లు ఇష్టంవచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు సైతం సూర్యాపేటలో మంత్రి పొంగులేటికి వివరించి చెప్పడం జరిగింది. మంత్రి కూడా అప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్నారని అధికారులు చెప్పారు. నిజానికి శనివారం సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్కు కూడా శంకుస్థాపన చేయించాలని ముఖ్యనేత భావించారు. కానీ శిఖం అని నిర్ధారణ కావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.

నార్కట్ పల్లిలో కూడా భూముల వ్యవహారంలో చెప్పినట్టు వినకపోవడంతో రెవిన్యూ ఇన్స్పెక్టర్ డెప్యూటేషన్ పైన వెళ్లిపోయి చాలా కాలమైంది. హోటల్ వివేరా పక్కనే కొంత ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమి ను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతలు పైరవీ చేశారు. రికార్డుల నుంచి అసైన్డ్ భూమి అనే పదం తొలగిస్తే కోట్లు ఖరీదైన భూమిని సొంతం చేసుకోవచ్చన్నది ప్లాన్. కానీ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆర్ఐ(RI)ని సైతం నార్కట్ పల్లి నుంచి సాగనంపినట్టు తెలిసింది.

Share
Share