- కాంగ్రెస్ విఫల పాలనపై 7 రోజుల పోరుబాట..
- సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు బీఆర్ఎస్ నిరసనలు..
- కంచర్ల భూపాల్ రెడ్డి కీలక వెల్లడి..
- గడియారం సెంటర్లో 420 ఫీట్ల ఫ్లెక్సీ, బాకీ కార్డుల పంపిణీ..
- ఆటో ర్యాలీలు, వంటావార్పులతో కాంగ్రెస్ వైఫల్యాల ఎండగడుతాం: బీఆర్ఎస్ నేతలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ‘వెయ్యి రోజుల’ విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా దిగ్విజయంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిరసన కార్యక్రమాల సమగ్ర వివరాలను వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ఆందోళనలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ఏడు రోజుల నిరసన షెడ్యూల్ వివరాలు:
బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాల ప్రణాళిక (సెప్టెంబర్ 2 – 8):
సెప్టెంబర్ 2: నల్లగొండ గడియారం సెంటర్లో మానవహారం, 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన, ప్రభుత్వ వైఫల్యాలపై ‘బాకీ కార్డుల’ పంపిణీ.
సెప్టెంబర్ 3: మండల కేంద్రాల్లో రైతు సదస్సులు. అనంతరం మిర్యాలగూడలో జరిగే కేటీఆర్ రైతు సదస్సుకు రైతులు, శ్రేణులు భారీగా హాజరుకావాలి.
సెప్టెంబర్ 4: ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులతో కలిసి వినూత్నంగా ‘వంటావార్పు’ నిరసన.
సెప్టెంబర్ 5: ఎన్జీ కళాశాల నుండి గడియారం సెంటర్ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల విడుదల, జాబ్ క్యాలెండర్ అమలుకై యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ.
సెప్టెంబర్ 6: ఎన్జీ కాలేజీ నుండి నల్లగొండ నగర వీధుల్లో ఆటో కార్మికులతో భారీ ఆటో ర్యాలీ.
సెప్టెంబర్ 7: నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి మండలాల్లో నిర్వహించే ‘ప్రజావాణి’లో అధికారులకు వినతిపత్రాల సమర్పణ.
సెప్టెంబర్ 8: మర్రిగూడ బైపాస్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 420 హామీల వినతిపత్రం అందజేత. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ముగింపు విలేకరుల సమావేశం.
రాజకీయం కోసం కాదు.. ప్రజల హక్కుల కోసమే!
నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. రాష్ట్ర కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు కటికం సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఈ నిరసనలు కేవలం రాజకీయం కోసం కాదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకేనని తెలిపారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బక్క పిచ్చయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు కరీంపాషా, నారబోయిన భిక్షం, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, అయితగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు మారగొని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, పల్లె రంజిత్, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, మిర్యాల యాదగిరి, తవిటి కృష్ణ, పెఱిక కరుణ్, జయరాజ్, బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.