- మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడి..
- బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ ఎదురుదాడి
- హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడికి ప్రతీకారంగా నల్గొండలో పరిణామాలు
- మంత్రి క్యాంపు ఆఫీస్ పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి, ఫ్లెక్సీల ధ్వంసం
- రాత్రికి రాత్రే జిల్లాలో ఉద్రిక్తత
- ఇందిరాభవన్ వద్ద భారీ బందోబస్తు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయాలపై దాడులకు ప్రతిదాడులకు దిగడంతో నల్గొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ నల్గొండలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్యాంపు కార్యాలయంపై సోమవారం సాయంత్రం బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతిదాడిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మునిసిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జిల్లా బీజేపీ కార్యాలయంపైకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలతో పాటు జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించి వేశారు.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ చేసిన దాడికి నిరసనగా తొలుత బీజేపీ కార్యకర్తలు నల్గొండలో మంత్రి క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీతో పాటు బీజేవైఎం కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ లో కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు ద్విచక్రవాహనాలపై వెళ్లి టమాటాలు, కోడిగుడ్లు విసిరేశారు. అదేవిధంగా క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న కటౌట్, ఫ్లెక్సీని చించివేసి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు మంత్రి కటౌట్ ను తగులబెట్టారు. ఈ సమయంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా లేరు. బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీ కార్యాలయాల జోలికి వస్తే కాంగ్రెస్ కార్యాలయాలను తగులబెడుతామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు మంత్రి కార్యాలయంపై దాడి చేసి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు గడియారం సెంటర్ లోని ఇందిరాభవన్ వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడులను చేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు గడియారం సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పీడీయాక్ట్ కింద అరెస్టు చేయాలని, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు, క్రమశిక్షణ ఉంటుందని పేర్కొంటూ బీజేపీ ఇదేవిధంగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోలేకనే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్లిత్ రెడ్డి ఇంటిపై రాళ్లదాడి..
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు దేవరకొండ రోడ్డులో ఉన్న వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో వర్లిత్ రెడ్డి తల్లి అయిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీదేవి మాత్రమే ఇంట్లో ఉన్నారు. వర్లిత్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో లేరు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్లి ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల డీవీఆర్ ను కూడా పగలగొట్టేస్తుంటే వర్షిత్ రెడ్డి తల్లి అడ్డుపడ్డారు. ఇరవై మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తమ ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు తన తమ్ముడిని కూడా కొట్టారని ఆరోపించారు. పోలీసులు ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ఆమె పేర్కొన్నారు.