- ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష
- వారాంతంలోగా నివేదికలు సమర్పించాలి: కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రజావాణి దరఖాస్తులతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ఇకపై మండల ప్రత్యేక అధికారులతో ప్రతి సోమవారం లేదా మంగళవారం సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సమావేశం అనంతరం మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్, ఎంపీడీవో, మండలాధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులతో సమావేశమై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించి వారాంతంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జిల్లా, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు.
పింఛన్ దరఖాస్తులు వెంటనే ఆన్లైన్ చేయాలి
పింఛన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేయకుండా భౌతికంగా దరఖాస్తులు సమర్పించినట్లయితే వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మూడు రోజుల్లో పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఇద్దరు టైలర్లు, రెండు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి.. విద్యార్థులకు యూనిఫాంలు సరిపోకపోతే అక్కడికక్కడే ఆల్ట్రేషన్ చేయించి ఇవ్వాలని సూచించారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
త్వరలో ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన నివేదికలను సీపీవోకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి నివేదికతో పాటు నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించిన నివేదికను ప్రత్యేకంగా రూపొందించి సమర్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా శాఖలు చేపట్టాల్సిన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్తులను డీమార్క్ చేయాలి
జిల్లాలో రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సంస్థలు, భూములు, ఆస్తులను డీమార్క్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఈ బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 1న దేవరకొండలో యూడీఐడీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృ నాయక్‌ను ఆదేశించారు.
వీఐపీ లేఖలపై ప్రత్యేక దృష్టి
ప్రముఖులు, వీఐపీల ద్వారా వచ్చే లేఖలు, దరఖాస్తులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కరించిన విషయాన్ని సంబంధిత ప్రజాప్రతినిధితో పాటు దరఖాస్తుదారులకు కూడా తెలియజేయాలని సూచించారు.
కాగా, సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 44, ఇతర శాఖలకు 39.. మొత్తం 83 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందుతున్న జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ సేవలను కలెక్టర్ చంద్రశేఖర్ కొనియాడారు.
ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్‌రెడ్డి, డీఆర్వో దశరథ్, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.