- ఫైర్ జోన్ దాటడంతో కీలక అడ్డంకి తొలగింపు
- సెప్టెంబర్ నుంచి నెలకు 350 మీటర్లు..
- జనవరి తర్వాత 450 మీటర్ల టార్గెట్
- 2028 ఆగస్టు నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడమే లక్ష్యం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శ్రీశైలం సొరంగం పనులకు ఇక మరింత వేగం రానుంది. ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ నిర్మాణంలో అత్యంత ప్రమాదకరమైన ఫైర్ జోన్ వద్ద డ్రైవింగ్ టన్నెల్ తవ్వకం పూర్తికావడంతో కీలక అడ్డంకి తొలగింది. దీంతో ఇప్పటివరకు ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఫైర్ జోన్ ప్రాంతంలో టన్నెల్ తవ్వకం అత్యంత క్లిష్టంగా సాగింది. భద్రతా పరమైన జాగ్రత్తలతో పనులు నిర్వహించాల్సి రావడంతో వేగం తగ్గింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని దాటడంతో ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది. దీంతో టన్నెల్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నెలకు 350 మీటర్లు.. ఆ తర్వాత 450 మీటర్లు
సెప్టెంబర్ నుంచి టన్నెల్ పనుల్లో వేగాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి నెలా సుమారు 350 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి తర్వాత పనుల వేగాన్ని మరింత పెంచి నెలకు 450 మీటర్ల వరకు తవ్వకం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు అవసరమైన యంత్రాలు, సాంకేతిక సిబ్బంది, ఇతర వనరులను సమకూర్చనున్నారు.
2028 ఆగస్టు నాటికి పూర్తి లక్ష్యం
ఎస్ఎల్బీసీ ట్విన్ టన్నెల్ పనులను 2028 ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఫైర్ జోన్ వంటి కీలక అవరోధాలు దాటడంతో ఇక పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పనుల వేగం పెరిగితే సొరంగ నిర్మాణం పూర్తయ్యే సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
శ్రీశైలం సొరంగం పూర్తయితే నల్లగొండ జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీటి భరోసా పెరగడంతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. అందుకే సొరంగం పనులను ఇక ఏమాత్రం జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కోరుతున్నారు.