Breaking News: తెలంగాణలో ఆంధ్ర మీడియా పెత్తనం నడవదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పరిణామాలు, క్రమశిక్షణ కమిటీ నివేదికల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ, హైకమాండ్ నిర్ణయాలు, పాత కార్యకర్తల గుర్తింపు మరియు మీడియా వ్యాఖ్యలపై ఆయన స్పష్టతనిచ్చారు. క్రమశిక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తామందరం పార్టీ అధిష్టానానికి, ఏఐసీసీ (AICC) నిర్ణయాలకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

పార్టీని బలహీనపరిచే ఉద్దేశం తనకు ఏనాడూ లేదని, అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

కార్యకర్తల ఆవేదన: పార్టీ కోసం కష్టపడిన పాత కార్యకర్తలకు న్యాయం జరగాలని, వారికి ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే తాను మాట్లాడానని చెప్పారు. కొత్తగా వచ్చిన కొందరు వ్యక్తులు పాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనల్లో మార్పులు: తాను గొంతు విప్పిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల నిబంధనల్లో మార్పులు వచ్చాయని, అది పార్టీ బలోపేతానికే దోహదపడిందని గుర్తుచేశారు.

అసత్య ప్రచారాలు: తెలంగాణలో ఆంధ్ర మీడియా సంస్థల పెత్తనం ఎక్కువైందని, తనలాంటి నికార్సైన నాయకుడిపై అసత్య కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

ఛానెళ్లు పెట్టే సత్తా ఉంది: ఆంధ్ర మీడియా వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. “నేను తలుచుకుంటే 100 పేపర్లు, 100 ఛానెళ్లు పెడతాను.. నాలాంటి తెలంగాణ ఉద్యమ నేతను ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయలేదు” అని హెచ్చరించారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి తాను నియోజకవర్గ పెండింగ్ బిల్లులు, అభివృద్ధి నిధుల కోసమే వచ్చానని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అక్కడికి కొండా మురళి రాకతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ భేటీతో తనకు ప్రమేయం లేదని తెగేసి చెప్పారు. మంత్రి కొండా సురేఖ విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయమని, రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

Share
Share