- హైదరాబాద్ క్లబ్ తరహాలో అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి హామీ
- రూ.2 కోట్లతో అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం
- మరో ఎకరం స్థలం సమకూర్చేందుకు చర్యలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ నగరంలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న నల్లగొండ క్లబ్‌కు మహర్దశ పట్టనుంది. క్లబ్‌ను మరింత విస్తరించి, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని క్లబ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. క్లబ్ అభివృద్ధికి పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని, కలెక్టర్‌తో మాట్లాడి భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.
ఇప్పటికే నల్లగొండ క్లబ్లో రూ.2 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. క్లబ్లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. క్లబ్ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
నల్లగొండ నగరాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని మంత్రి తెలిపారు. నగరానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.
నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు చేపట్టామని, ఆరు నెలల్లో వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, సుమారు రూ.1,400 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.300 కోట్లతో అండర్‌డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నిధులు సమకూర్చుకుని పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, 2028 ఆగస్టు నాటికి సొరంగ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
నల్లగొండ క్లబ్ అభివృద్ధికి మంత్రి ప్రత్యేకంగా హామీ ఇవ్వడం, అదనపు స్థలం సమకూర్చేందుకు ముందుకు రావడం క్లబ్ సభ్యుల్లో ఆసక్తిని రేకెత్తించింది. నగరంలో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉన్న క్లబ్ మరింత విస్తరించేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి.
కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్డీవో వై.అశోక్‌రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, కార్పొరేటర్ ఏదుల శ్రీధర్‌రెడ్డి, గుమ్మల జానకిరెడ్డి, క్లబ్ సెక్రటరీ చల్ల వెంకటరమణ, కాసర్ల వెంకటరెడ్డి, క్లబ్ సభ్యులు డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.