Breaking News: మీర్‌పేట్‌లో రౌడీషీటర్ సూరి దారుణ హత్య.. ఆపై ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ లో పోలీసులకే ఛాలెంజ్..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్యోదంతం చోటుచేసుకుంది. నందనవనం ప్రాంతంలో రౌడీషీటర్ సూరి అలియాస్ సురేష్ను అఫ్రోజ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు.

ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు అఫ్రోజ్ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి, పోలీసులు తనను పట్టుకోలేరంటూ బహిరంగంగా సవాల్ విసరడం నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన రౌడీషీటర్ సూరికి గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.

నగర బహిష్కరణ అమల్లో ఉండగానే: తన భార్య, బావమరిది సల్మాన్ హత్య కేసులతో పాటు వరంగల్, హైదరాబాద్, రాచకొండ/మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో సూరిపై అనేక తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అతనిపై నగర బహిష్కరణ (ఎక్స్టర్న్మెంట్) అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

నందనవనానికి రాక: నగర బహిష్కరణను ఉల్లంఘించి సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు మీర్పేట్లోని నందనవనానికి వచ్చాడు.

సూరి నందనవనానికి వచ్చాడనే పక్కా సమాచారంతో, గతంలో సూరి చేతిలో హత్యకు గురైన సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ అక్కడికి చేరుకున్నాడు. పాతకక్షలను మనసులో ఉంచుకుని పగతీర్చుకోవడానికి వ్యూహం పన్నాడు.

దాడి జరిగిన తీరు: సూరి కనిపించగానే అకస్మాత్తుగా అతని కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లాడు. సూరి కోలుకునే లోపే తన వెంట తెచ్చుకున్న వేటకత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

ఆసుపత్రికి తరలింపు: తీవ్ర గాయాల పాలై రక్తాపుమడుగులో పడివున్న సూరిని స్థానికులు తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

హత్య చేసిన తర్వాత నిందితుడు అఫ్రోజ్ తప్పించుకోవడమే కాకుండా, ఇన్స్టాగ్రామ్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. “నన్ను పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేరు” అంటూ రౌడీయిజం రీతిలో బహిరంగంగా ఛాలెంజ్ విసిరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో మీర్పేట్ పోలీసులు తీవ్రంగా పరిగణించి, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Share
Share