చేగుంట/మెదక్, ఏపీబీ న్యూస్: మెదక్ జిల్లాలో అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన ప్రజాప్రతినిధులపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా సర్పంచ్ కోండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ భర్త కొండి స్వామి గ్రామ పంచాయతీ పరిధిలో చేసిన వరుస అక్రమాలు, దౌర్జన్యాలే ఈ సస్పెన్షన్‌కు ప్రధాన కారణమని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సర్పంచ్‌గా మహిళ ఎన్నికైనప్పటికీ, ఆమె భర్త కొండి స్వామి పంచాయతీ వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేయడంపై గ్రామానికి చెందిన పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.
హరితహారం మొక్కలు, టాయిలెట్స్ ధ్వంసం.. భర్త స్వామి అరాచకాలు
పొలంపల్లి సర్పంచ్ భర్త కొండి స్వామి గత కొంతకాలంగా గ్రామంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, పంచాయతీ నిధులను, వస్తువులను దుర్వినియోగం చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఆయనపై రుజువైన ప్రధాన ఆరోపణలు ఇవే:
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన హరితహారం మొక్కలను కొండి స్వామి తొలగించినట్లు అధికారులు గుర్తించారు.
పంచాయతీ ఫర్నిచర్ విధ్వంసం: గ్రామ పంచాయతీ కార్యాలయంలోని విలువైన ఫర్నిచర్‌ను, పబ్లిక్ టాయిలెట్లను (మరుగుదొడ్లను) ధ్వంసం చేసి తీవ్ర నష్టం వాటిల్లజేశారు.
కార్యాలయానికి తాళం: పంచాయతీ ఆస్తులను నాశనం చేయడమే కాకుండా, ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికే తాళం వేసి సిబ్బందిని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అరాచకాలకు పాల్పడ్డారు.
కలెక్టర్ యాక్షన్ ప్లాన్ – ఆరు నెలల పాటు దూరం..
సర్పంచ్ భర్త అరాచకాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు.మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాలు: గ్రామ పంచాయతీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, భర్త అక్రమాలకు పరోక్షంగా సహకరించినందుకు గాను పొలంపల్లి సర్పంచ్ కోండి రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేయడం జరిగింది. 6 నెలల పాటు ఆమె సర్పంచ్ బాధ్యతలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.