Breaking News: ఎమ్మెల్యే మందుల సామేల్‌తో సమస్య లేదు :ఎంపీ చామల

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉంటూ పగటి కలలు కంటున్నారని భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లు, తామే గెలిచినట్లు కేటీఆర్ ఊహల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ చామల మాట్లాడారు.

“జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాము 50 వేల మెజారిటీతో గెలుస్తామని కేటీఆర్ గొప్పలు చెప్పారు. కానీ లోక్సభ ఎన్నికల్లో భారాసాకు ‘గుండు సున్నా’ వచ్చింది. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ లాంటి సిట్టింగ్ సీట్లలో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది” అని ఎంపీ చామల గుర్తుచేశారు.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ మాట తప్పారని, ప్రజా పాలనపై నేడు ప్రజలకు పూర్తి భరోసా ఉందని చామల పేర్కొన్నారు. కేటీఆర్ కేవలం తన పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకే ‘పులికేశి’ వేషాలు వేస్తూ ప్రెస్మీట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రాజెక్టుల పేరిట దోపిడీ: కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో చారిత్రాత్మక ప్రాజెక్టులను నిర్మిస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కాస్తా ‘బొందల గడ్డ’గా మార్చిందని మండిపడ్డారు.

భారీ అప్పుల భారం: కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను ఏకంగా రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, ఇంతగా రాష్ట్రాన్ని ముంచిన వారు మళ్లీ ఏ మొహం పెట్టుకుని అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని నిలదీశారు.

బీజేపీ ద్వంద్వ వైఖరి: గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేత జె.పి. నడ్డా అన్నారని, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని అవాకులు చెవాకులు పేలుతున్నారని అగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టుపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తామన్నా కేంద్రం, స్థానిక బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నడుస్తున్న కాంగ్రెస్ అంతర్గత మండల అధ్యక్షుల వివాదంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • “తుంగతుర్తి నియోజకవర్గంలో మాకు ఎలాంటి వ్యక్తిగత పంచాయతీలు లేవు. అయితే, మండల అధ్యక్షుల నియామకాల్లో స్థానిక కార్యకర్తలతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం కేడర్లో వ్యక్తమైంది. దీనివల్ల కొంతమంది నాయకుల మధ్య గొడవ జరిగింది.
  • మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాల మేరకే మండల అధ్యక్షుల ఎంపిక జరగాలన్నదే నా భావన. గొడవలు జరుగుతాయని ముందే ఊహించి, ఈ ప్రకటనను తాత్కాలికంగా ఆపాలని కోరాను. ఈ వివాదంపై ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కు లేఖ కూడా రాశాను.” అని చామల వెల్లడించారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ (సామ్యూల్)తో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని ఎంపీ చామల స్పష్టం చేశారు. మండల అధ్యక్షుల ఎంపికలో తాను ఎలాంటి అనవసర జోక్యం చేసుకోబోనని ఎమ్మెల్యేకు ముందే చెప్పానని, అందరినీ కలుపుకుని నిర్ణయాలు తీసుకోవాలనేదే తన ఆకాంక్ష అని వివరించారు. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) జరిగితే, అప్పటి రాజకీయ పరిణామాల ఆధారంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సహా జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని, ఆమె ఇప్పుడు కాంగ్రెస్పై ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు.

Share
Share