Breaking News:ప్రియురాలి కోసం టవళ్లతో జైలు గోడ దూకి.. పోక్సో కేసు ఖైదీ పరార్..

మహబూబ్నగర్, ఏపీబీ న్యూస్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జిల్లా సబ్ జైలులో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ పోక్సో (POCSO) కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న యువకుడు జైలు అధికారుల కళ్లు గప్పి సినిమా ఫక్కీలో జైలు గోడ దూకి పరారయ్యాడు. ఈ తాజా ఉదంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ಜైలు భద్రతా వైఫల్యాలపై ఉన్నతాధికారులు సీరియస్గా విచారణ జరుపుతున్నారు.

జైలు నుంచి పారిపోయిన సదరు ఖైదీ.. వనపర్తి జిల్లాలోని ‘సఖి’ (Sakhi One Stop Centre) కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తన ప్రియురాలిని కలిసేందుకే ఈ సాహసానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

పోలీసులు మరియు జైలు వర్గాల కథనం ప్రకారం.. ఈ జైలు పరార్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖైదీ నేపథ్యం: అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్ కుమార్ (22) అనే యువకుడు సుమారు 25 రోజుల క్రితం ఓ మైనర్ బాలిక వ్యవహారంలో పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయ్యాడు. అప్పటి నుండి అతడు మహబూబ్నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

సినిమా తరహా ప్లాన్: సోమవారం ఉదయం కిశోర్ కుమార్ బ్యారెక్ లోపల నుంచి బయటకు వస్తూ తోటి సిబ్బందితో తాను బాత్రూమ్కు వెళ్తున్నానని చెప్పాడు. అయితే, ఎవరూ గమనించని సమయం చూసి తాను ముందే సిద్ధం చేసుకున్న నాలుగు స్నానం చేసే టవళ్లను (Towels) ఒకదానికొకటి గట్టిగా ముడి వేశాడు.

గోడ దూకి ఎస్కేప్: ఆ టవళ్ల సాయంతో జైలు లోపలి ప్రహరీ గోడపైకి ఎక్కి, అక్కడ నుంచి అవతలి వైపునకు దూకి క్షణాల వ్యవధలో పరారయ్యాడు. బాత్రూమ్కు వెళ్లిన ఖైదీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన జైలు వార్డెన్లు లోపల వెతకగా.. గోడకు వేలాడుతున్న టవళ్లు కనిపించడంతో ఖైదీ పారిపోయినట్లు గుర్తించి షాక్కు గురయ్యారు.

ఖైదీ కిశోర్ కుమార్ జైలు నుంచి నేరుగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న ‘సఖి’ కేంద్రానికి వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు: కిశోర్ కుమార్ ప్రేమించిన యువతి ప్రస్తుతం వనపర్తి సఖి కేంద్రంలోనే సంరక్షణలో ఉంది. ఆమెను కలవడానికే అతడు జైలు గోడ దూకినట్లు స్పష్టమవడంతో మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించి తనిఖీలు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు.

సిబ్బంది నిరంతరం పహారా కాసే జిల్లా జైలులో.. అది కూడా ఉదయం పూట ఒక ఖైదీ నాలుగు టవళ్లను ముడి వేసి అంత పెద్ద గోడ దూకి పారిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Share
Share