ఖమ్మం/ఏన్కూర్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో గృహ వినియోగ ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థపై స్థానిక వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగదారుల ఇళ్లకు చేరాల్సిన గ్యాస్ సిలిండర్లు.. క్షేత్రస్థాయిలో మాత్రం స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణానికే పరిమితమవుతున్నాయి. ఈ వివాదాస్పద LPG Gas దందా కారణంగా మండల పరిధిలోని మారుమూల గ్రామాల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు దివ్యాంగులు సిలిండర్ల కోసం కిలోమీటర్ల మేర నడిచి రావాల్సి వస్తోందని ఏపీబీ న్యూస్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
వినియోగదారులు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బుకింగ్ చేసినప్పటికీ, డోర్ డెలివరీ చేయకుండా ఏన్కూర్ మార్కెట్ సమీపంలోనే గ్యాస్ అడ్డాగా మార్చి వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గంటల తరబడి ఎండలో గ్యాస్ వాహనం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై సిలిండర్లు కాళ్లతో నెట్టుకుంటూ..
ఏన్కూర్ మండలంలో డోర్ డెలివరీ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితమైందని చెప్పడానికి క్షేత్రస్థాయి దృశ్యాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సొంతంగా ద్విచక్ర వాహనాలు (బైకులు) లేని పేద కుటుంబాలు, మహిళలు మార్కెట్ యార్డ్ నుంచి భారీ బరువుండే గ్యాస్ సిలిండర్లను ఇంటికి తరలించలేక రోడ్లపై కాళ్లతో నెట్టుకుంటూ తీసుకెళ్తున్న విజువల్స్ స్థానికంగా కలచివేస్తున్నాయి.
రికార్డుల్లో డోర్ డెలివరీ: గ్యాస్ ఏజెన్సీలు రికార్డుల్లో మాత్రం వినియోగదారుల ఇంటి వద్దకే సిలిండర్ చేర్చినట్లు చూపిస్తూ డెలివరీ ఛార్జీలను గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆఫీసుల ముందే అక్రమాలు: మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏన్కూర్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనే ఈ అక్రమ గ్యాస్ పంపిణీ జరుగుతున్నప్పటికీ, ఏ ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
హోటళ్లు, టీ కొట్లలో గృహ వినియోగ సిలిండర్ల దందా
ఈ LPG Gas Cylinder Delivery Scam వెనుక సరుకు మళ్లింపు వ్యవహారం కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వాణిజ్య అవసరాలకు కమర్షియల్ (నీలి రంగు) సిలిండర్లు మాత్రమే వినియోగించాల్సి ఉండగా.. ఏన్కూర్ మండల పరిధిలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు, మరియు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు.
గ్యాస్ డెలివరీ బాయ్స్, కొందరు దళారులు కలిసి సాధారణ ప్రజలకు అందాల్సిన సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో హోటల్ యజమానులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఒకవైపు ప్రభుత్వానికి భారీగా పన్ను ఆదాయ నష్టం వాటిల్లడంతో పాటు, నిజమైన లబ్ధిదారులకు సకాలంలో గ్యాస్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
పౌర సరఫరాల శాఖ (Civil Supplies) పర్యవేక్షణ ఏదీ..?
వినియోగదారుల హక్కులను కాలరాస్తూ, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న గ్యాస్ ఏజెన్సీల అక్రమ విక్రయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సదరు ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏన్కూర్ మండలంలో గ్యాస్ పంపిణీ వ్యవస్థపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వాడుతున్న హోటళ్లపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏజెన్సీలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏన్కూర్ మండల ప్రజలు కోరుతున్నారు.