APB News Exclusive: ఎపిసోడ్:2 పానగల్లు ‘ఠాకూర్’ భూముల వెనక పెద్దల హస్తం?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: పానగల్లులో వివాదస్పదంగా మారిన ‘ఠాకూర్’ భూముల వెనక పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు వ్యవహారించిన తీరు పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ, రెవిన్యూ అధికారుల ప్రమేయం లేకుండా పోలీసులు ఏకపక్షంగా ఎలా వ్యవహారిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. బుధవారం నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన బాధితులు తమ ఆవేధన వెళ్లగక్కారు. 40 ఏళ్ల క్రితం ఠాకూర్ కుటుంబం నుంచి ప్లాట్లు కొన్నామని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఇళ్లు కట్టుకున్నామని మంత్రికి వివరించారు. కానీ ఠాకూర్ కుటుంబానికి చెందిన హరినాథ్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి ఇళ్లను, ప్లాట్లను ఆక్రమించుకుంటున్నాడని చెప్పారు. పోలీసుల అండంతో ప్లాట్లను ఆక్రమించి ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేసిండని బాధితులు చెప్పారు. త్వరలోనే కట్టిన ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరిస్తున్నారని మంత్రికి వివరించారు. దీని పైన స్పందించిన మంత్రి డీఎస్పీ(DSP)ని విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

పానగల్లు ఠాకూర్ భూముల వివాదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతం నల్లగొండ మున్సిపాలిటీలోని 35వ డివిజన్ పరిధిలో ఉండగా, ఆ డివిజన్కు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వివాదం జరుగుతున్న ప్రాంతంలో ఎక్కువగా పేద, నిరుపేద కుటుంబాలు నివసిస్తుండగా, కొందరు రైతులకు చెందిన ఖాళీ ప్లాట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు పోలీసులు పానగల్లులో మకాం వేసి, వివాదాస్పద భూముల వద్ద చర్యలు చేపట్టినప్పటికీ, మేయర్కు గానీ, రెవిన్యూ శాఖ అధికారులకు గానీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ముందస్తు సమాచారం లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో చర్యలు జరుగుతున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై బుధవారం మంత్రి వెంకటరెడ్డి వద్ద కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. పట్టణంలో ఇంత కీలక పరిణామం చోటు చేసుకున్నప్పటికీ, కనీసం మేయర్కు సమాచారం ఇవ్వకపోవడం, పోలీసులు వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో, పానగల్లు అంశం మంత్రి దృష్టికి వెళ్లకుండా అధికార పార్టీలోని మరో వర్గం తెరవెనుక ప్రయత్నాలు చేశారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనేది తెలిసినప్పటికీ బయటకు చెప్పుకోలేని విచిత్రికరమైన పరిస్థితి స్థానిక లీడర్ల లో నెలకొంది.

హైకోర్టు ఆదేశాల అమలు విషయంలో అనుసరించాల్సిన విధానం చట్ట ప్రకారం భిన్నంగా ఉంటుందని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల అమలుకు ముందుగా హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్కు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసుల ఆధారంగా తహసీల్దార్, సంబంధిత రెవిన్యూ సిబ్బంది, సర్వేయర్లకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అనంతరం రెవిన్యూ అధికారులు, సర్వేయర్లు, పోలీసుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పంచనామా నిర్వహిస్తారు. కోర్టు ఆదేశాల మేరకు భూమిని కొలిచిన తర్వాత, రికార్డుల్లో ఉన్న సంబంధిత వ్యక్తులకు రెవిన్యూ శాఖ మరోసారి నోటీసులు అందజేస్తుంది. అవసరమైతే భూమి స్వాధీనం ప్రక్రియను కూడా రెవిన్యూ అధికారుల పర్యవేక్షణలోనే చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసుల పాత్ర ప్రధానంగా శాంతిభద్రతల పరిరక్షణ, భద్రత కల్పించడం వరకే పరిమితమై ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. అయితే పానగల్లు భూముల వ్యవహారంలో ఈ ప్రక్రియ ఎక్కడా పూర్తిస్థాయిలో అమలైనట్లు కనిపించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెవిన్యూ శాఖ ప్రమేయం లేకుండానే పోలీసులు ఏకపక్షంగా చర్యలు చేపట్టారని వారు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, పానగల్లు భూముల వ్యవహారంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆర్డీఓ(RDO) అశోక్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల అమలు విషయంలో చట్టపరమైన ప్రక్రియలో రెవిన్యూ అధికారుల పాత్ర తప్పనిసరిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో పానగల్లు భూముల వ్యవహారంలో అనుసరించిన విధానంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Share
Share