Breaking News: గెలిచాక ప్రవర్తన మారితే ప్రజలు ఇళ్లకు పంపుతారు:ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చౌటుప్పల్, ఏపీబీ న్యూస్: “నాయకుడనే వాడు ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండాలి, వారి మాటను వినాలి, గౌరవించాలి.. అప్పుడే ప్రజల్లో నిజమైన నాయకుడిగా మనగలుగుతాం” అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటూ.. ఆపదొచ్చినా, సాపదొచ్చినా ఆదుకునేవాడే అసలైన లీడర్ అని ఆయన స్పష్టం చేశారు.

ఈ రాజకీయ పరిణామాలకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చౌటుప్పల్ పట్టణంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎంపికైన చౌటుప్పల్ మండల, పట్టణ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కార్యక్రమంలో నూతన అధ్యక్షులను అభినందించిన అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

కలిసికట్టుగా పనిచేయాలి: గ్రామస్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రాజకీయాలలో సరైన ఫలితాలు వస్తాయని ఆయన పిలుపునిచ్చారు.

2018 మునుగోడు విజయం: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) గాలి వీచినా, మునుగోడులో మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని ఆయన గుర్తుచేశారు. రాజకీయాలలో ఉండేవారు ఓపికతో ప్రజల పనులు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పదవులు వస్తాయని క్యాడర్కు భరోసా ఇచ్చారు.

ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లీడర్ అనేవాడు వ్యక్తిగతంగా మంచివాడా కాదా, ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాడా లేదా, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాడా లేదా అని ఓటర్లు ప్రతిక్షణం సునిశితంగా గమనిస్తుంటారని హెచ్చరించారు.

“ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొందరి ప్రవర్తనలో అహంకారం లేదా మార్పు వస్తుంది. అలా మార్పు వస్తే వచ్చేసారి ప్రజల తీర్పు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది. మిమ్మల్ని గద్దె దించి ఇళ్లకు పంపడానికీ ప్రజలు వెనకాడరు.”

నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అందర్నీ సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇందిరమ్మ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల్లోకి వేగంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కొత్త కమిటీలపై ఉందన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదని, ఇకముందు కూడా పడే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

తమకు మండల, పట్టణ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు చౌటుప్పల్ నూతన మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల, మున్సిపల్ పరిధిలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share
Share