- సీఎం సభలో పున్నా కైలాష్కు చోటుందా..?
- నల్లగొండ కాంగ్రెస్‌లో కొత్త చర్చ
- హోర్డింగ్స్‌లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు
- డీసీసీ అధ్యక్షుడు మిస్సింగ్ ఎందుకు..?
- నల్లగొండ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు? పున్నా ఎంట్రీపై సందిగ్ధం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లు జోరుగా సాగుతున్న వేళ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాత్రపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్జీ(NG) కళాశాల వేదికగా నిర్వహించనున్న సీఎం సభ కోసం భారీ ఎత్తున హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిలో జిల్లా పార్టీ అధ్యక్షుడి ఫొటో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతోందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో, డీసీసీ(DCC) చీఫ్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కైలాష్ రాక పైన సర్వత్రా చర్చ..
పున్నా కైలాష్ నేత డీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వర్గీయులు ఆయన రాకను అడ్డుకుంటున్నారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ పదవి దక్కకపోవడంతోనే కైలాష్ నేతను నల్లొండలో అడుగుపెట్టనివ్వడం లేదనే చర్చ పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మంత్రి కోమటిరెడ్డిని నోటికొచ్చినట్టు తిట్టిన కైలాష్ నేతకు డీసీసీ(DCC) పదవి ఎట్లా ఇస్తారని మంత్రి వర్గీయులు అప్పట్లోనే పీసీసీ(PCC) నాయకత్వాన్ని నిలదీసింది. అప్పటి నుంచి నల్లగొండలో పార్టీ పరంగా జరిగిన కార్యక్రమాలకు కూడా కైలాష్ నేతను ఆహ్వానించలేదు. కనీసం హోర్డింగ్ లు, ఫ్లెక్సీల్లో ఫోటో కూడా పెట్టకుండా డీసీసీ పదవిని అవమానించే విధంగా వ్యవహారించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కైలాష్ నేతకు పార్టీ అధ్యక్షుడిగా దక్కాల్సిన ప్రోటోకాల్ ఎక్కడా పాటించలేదు. ఇటీవల కైలాష్ బర్త్ డే సందర్భంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం మంత్రి వర్గీయులు ధ్వంసం చేశారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకోవాల్సిన పార్టీ భీఫారాలు కూడా డీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గంలోని పార్టీ మీటింగ్‌లు, బూత్ లెవల్లో నిర్వహించిన సర్(SIR) మీటింగ్ లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సమావేశాలకు కైలాష్ నేతకు ఆహ్వానం అందుతోంది. చివరకు మంత్రి కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాల సైతం కైలాష్ నేత జిల్లా అధ్యక్షుడి హోదాలో పాల్గొంటున్నారు. కానీ నల్లగొండలోనే డీసీసీ అధ్యక్షుడికి ఎంట్రీ పాస్ దక్కకపోవడం గమనా ర్హం.
సీఎం పర్యటన అధికారికంగానే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హ్యామ్(HAM) రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 28న కనగల్ లో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కనగల్ వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ ఏర్పాటు చేశారు. నల్లగొండలో ఎన్జీ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 28 (ఆదివారం)న సీఎం వస్తారని తెలిసింది. హ్యామ్ రోడ్లు శంకుస్థాపన ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి కైలాష్ నేతకు ఆహ్వానం ఉండొచ్చని అంటున్నారు. కానీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి మేరకే కైలాష్ రాక ఆధారపడి ఉంటదని ఆయన వర్గం చెప్తోంది. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, కార్పోరేటర్ల ఫోటోలు తప్పా డీసీసీ ఫోటో ఫ్లైక్సీల పైన కనిపించడం లేదు.