- నల్లగొండ కార్పోరేషన్లో మరో భూవివాదం
- పానగల్లులో రెండు ఎకరాల పై వారసుల కన్ను
- 1984లో అమ్మిన భూముల పై పెనుదుమారం
- కోర్డు ఆర్డర్ అడ్డగా..పేదల భూములకు ఇనుపకంచెలు
- భారీగా పోలీసుల మోహరింపు.. టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- పట్టించుకోని అధికార పార్టీ నేతలు.. ఆందోళనలో బాధితులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో భారీ భూ వివాదం కలకలం రేపుతోంది. పానగల్లు సర్వే నంబర్ 1444లో నాలుగు దశాబ్దాల క్రితమే ప్లాట్లుగా విక్రయించిన రెండు ఎకరాల 18 గుంటల భూమిపై తాజాగా వారసత్వ హక్కుల పేరుతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని పేదల ఆధీనంలో ఉన్న భూముల్లో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే..
పానగల్లు సర్వే నంబర్ 1444లోని 2.18 ఎకరాల వ్యవసాయ భూమిని 1984లోనే ప్లాట్లుగా విభజించి స్థానిక పేద, మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించారు. అప్పట్లో నాలా అనుమతులు, ప్రస్తుత మున్సిపల్ నిబంధనలు లేకపోవడంతో కచ్చా లేఅవుట్ కింద 100 నుంచి 150 గజాల చొప్పున ప్లాట్లు అమ్మారు. కొంత మంది రైతులు రెండు వేల గజాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూములు పేదల ఆధీనంలోనే ఉన్నాయి. అయితే, 42 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఈ భూమి తమ దేనంటూ హరినాథ్ సింగ్ ఠాగూర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. రెవిన్యూ రికార్డుల్లో భూమి ఇప్పటికీ తమ పూర్వీకుల పేర్లతోనే ఉందని చెప్పి కోర్టు ఉత్తర్వులు పొందినట్లు సమాచారం. ఆ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఠాగూర్ది భూస్వాముల కుటుంబమే..!
స్థానికులు, బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం హరినాథ్ సింగ్ ఠాగూర్ కుటుంబానికి ఒకప్పుడు నల్లగొండ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములు ఉండేవని తెలుస్తోంది. దండెంపల్లి, చందనపల్లి, పానగల్లు, మర్రిగూడ, గుండ్లపల్లి తదితర గ్రామాల్లో విస్తారమైన భూములను వారసత్వంగా అనుభవిస్తూ వచ్చిన ఈ కుటుంబం, కాలక్రమంలో వాటిలో కొంతభాగాన్ని విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. అందులో భాగంగానే పానగల్లు సర్వే నంబర్ 1444లోని 2.18 ఎకరాల భూమిని 1984లో రిక్షా కార్మికులు, ఉప్పెర పనులతో జీవనం సాగించే పేద, నిరుపేద కుటుంబాలు, కొంతమంది రైతులకు ప్లాట్ల రూపంలో విక్రయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. అయితే నాలుగు దశాబ్దాల క్రితం విక్రయించిన ఇదే భూమిపై ఇప్పుడు మళ్లీ హక్కులు ప్రకటిస్తూ హరినాథ్ సింగ్ ఠాగూర్ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సర్వే నంబర్ 14 44లోని 2.18 ఎకరాల భూమి రెవిన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఠాగూర్ కుటుంబ సభ్యుల పేర్లపైనే కొనసాగుతుండటం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అప్పట్లో జరిగిన అమ్మకాలు రెవిన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ కాకపోవడంతో పహాణీల్లోనూ పాత యజమానుల పేర్లే కొనసాగినట్లు సమాచారం. రెవిన్యూ లొసుగులను అడ్డంపెట్టుకుని, ఇప్పటికే విక్రయించి చేతులు దులుపుకున్న భూములపై మళ్లీ హక్కులు చెలాయించే ప్రయత్నం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
భారీగా మోహరించిన పోలీసు బలగాలు..
భూముల వివదాల్లో తలదూర్చమని, సివిల్ కేసులు కోర్టు పరిధిలోకి వస్తాయని స్టేషన్ల ముందు నోటీసు బోర్డులు పెట్టిన పోలీసులు పానగల్లు భూముల విషయంలో మాత్రం వేగంగా స్పదించారు. చాలా మంది భూముల తగాదాల విషయంలో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నప్పటికీ బాధితుల పక్షాన క్షేత్రస్థాయిలో అండగా నిలబడేందుకు పోలీసులు సాహసించరనే సంగతి తెలిసిందే. కానీ పానగల్లులో మాత్రం పోలీసుల తీరును గమనించిన బాధితులు నివ్వెరపోయారు. కోర్టు నుంచి పోలీసు ప్రొటెక్షన్ కోరడంతోనే అంతమంది పోలీసులు రెండు రోజుల పాటు పానగల్లులో ఠాగూర్ కు రక్షణ కల్పించారని తెలిసింది. ప్రత్యేక పోలీసు బలాలు, ఎస్ఐ(SI)లు, సీఐ(CI)లు, మహిళా కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది రెండు రోజుల పాటు పానగల్లులోనే మకాం పెట్టారు. ఠాగూర్ కు అండగా నిలబడి, రెండు ఎకరాలకు నలువైపులా ఇనుప ఫెన్సింగ్ బిగించేంతవరకు అక్కడే మకాం వేశారు. బాధితుల పక్షాన పోలీసులకు నచ్చచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు.
అధికార పార్టీ నేతలు బిజీ.. టూ టౌన్ లో ఫిర్యాదు..
పానగల్లులో పేదల భూములను లాక్కుంటున్న సంగతి స్థానిక ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ లీడర్లకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిసింది. మాట్లాడుదాం.. చూద్దాం.. అని సర్ధిచెప్పారని, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని ఉచిత సలహా ఇచ్చారే తప్పా పేదల పక్షాణ నిలబడేందుకు ఎవరూ ముందుకు రాలేదని బాధితులు అంటున్నారు. చివరకు స్థానిక కార్పోరేటర్ సహకారంతో టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సీఎం నల్లగొండ పర్యటన నేపథ్యంలో రూలింగ్ పార్టీ లీడర్లు ఏర్పాట్ల బిజీలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ కాలనీలో జరిగిన నలుగురి మృతి సంఘటన కారణంగా పోలీసులు కేసును చేధించే పనిలో పడ్డారని తెలిసింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఠాగూర్ ఇదే విధంగా ప్రవర్తించారని, మళ్లీ ఇప్పుడు అదే వైఖరితో పేదల భూములను కాజేసేందుకు పక్కా ప్లాన్ వేసిండని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.