మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుల ‘బీడ్’ (ఉత్పత్తి). అలాగే స్థానిక మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ‘అపరిచితుడు’ లాంటివాడు, ఆయనో ఒక ఓటిపి ఎమ్మెల్యే” అంటూ జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారీగా కలిసి పనిచేస్తూ తెలంగాణను దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
వైటీపీఎస్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం
దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) ను ప్రైవేట్ పరంచేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైటీపీఎస్ (YTPS) ప్రైవేటీకరణను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటుంది. స్థానిక నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు మా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది” అని స్పష్టం చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన స్కీములను నేరుగా ప్రజలకు చేరవేస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రోజుకో సరికొత్త స్కామ్లు, కుంభకోణాలతో కుప్పకూలిపోతోందని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు.. పోలీసులపై జగదీష్ రెడ్డి ఫైర్
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు:
స్వామి కార్యం చేస్తున్న పోలీసులు: కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. కానీ పోలీస్ శాఖ మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. అది ఎలా అంటే.. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ నేతల దయాదాక్షిణ్యాల కోసం ‘స్వామి కార్యం’ నిర్వర్తించడంలో మాత్రమే పోలీస్ శాఖ బిజీగా ఉంది.
రివర్స్ కేసులు – జైలు పాలే: కాంగ్రెస్ నేతల మాటలు విని మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. మేము రాగానే మా శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ తక్షణమే తొలగిస్తాం. అంతేకాకుండా, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ కేసులు బనాయించిన సదరు పోలీసు అధికారులపై రివర్స్ కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలకే అందుతున్న పథకాలు.. బీఎల్ఏలకు పిలుపు
కేసీఆర్ హయాంలో కరెంట్, యూరియా, రైతుబంధు, దళితబంధు తదితర సంక్షేమ పథకాలు కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ అందేవని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యంలో కేవలం కాంగ్రెస్ నాయకులకు, వారి అనుచరులకు, కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియపై మాట్లాడుతూ బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అత్యంత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. “బీహార్, పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అనుకూల ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించే పెద్ద కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఓట్లు తొలగించే ఈ దుర్మార్గాన్ని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో అడ్డుకోవాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.