- అధికారులు మాట వినకపోతే నీకెందుకు సిగ్గు లేదు?
- తుంగతుర్తిలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే: గాదరి కిషోర్ గెలుపును ఎవరూ ఆపలేరు
- రేవంత్ రెడ్డి చంద్రబాబు, మోదీల హైబ్రిడ్ ముఖ్యమంత్రి
తుంగతుర్తి/సూర్యాపేట, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసిందని, రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే Jagadish Reddy తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ కీలక సమావేశంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్వే ప్రక్రియ మరియు బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డి చంద్రబాబు, మోదీల హైబ్రిడ్ సీఎం: జగదీష్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై కనీస అవగాహన లేకుండా పాలిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత విమర్శించారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీల కలయికలో వచ్చిన ఒక ‘హైబ్రిడ్ ముఖ్యమంత్రి’. సీఎం సీట్లో కూర్చొని.. నా మాట అధికారులు ఎవ్వరూ వినడం లేదు అని రివ్యూ మీటింగులలో చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదా? తన మాటను తనే లెక్క చేయించుకోలేని ఇంత పనికిమాలిన, దద్దమ్మ ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా ఉండడు” అని జగదీష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా ఇవ్వలేని చేతకాని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా పట్టు కోల్పోయి మొత్తం నెపం మున్సిపల్, పోలీస్ అధికారులపై నెట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మూడు యాసంగిలు.. తుంగతుర్తికి కన్నీళ్లు
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ వైఫల్యాలను జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పోల్చి చూపారు:
ఎండిపోయిన పొలాలు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి, పసిడి సిరులు పండించాం. కానీ ఈ కాంగ్రెస్ దుర్మార్గులు అధికారంలోకి వచ్చాక గడిచిన మూడు యాసంగి సీజన్లలో తుంగతుర్తికి నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టారు.
ఐకేపీ కేంద్రాల్లో వడ్ల తిప్పలు: నేటికీ రైతులు పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే నెలల తరబడి మూలుగుతున్నాయి. అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నా కొనే దిక్కు లేదు.
రైతులపై యాప్ల భారం: రైతులకు కనీసం యూరియా, డీఏపీ (DAP) కూడా ఇవ్వలేక ఈ కాంగ్రెస్ నాయకులు చాతికిలపడ్డారు. ఇప్పుడు ఎరువుల కొనుగోలుకు కూడా కొత్త యాప్లు పెడుతూ రైతులను తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు.
జిల్లాకు పట్టిన ‘హెలికాప్టర్ మంత్రులు’
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ మంత్రులపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ క్షేత్రస్థాయిని వదిలేసి గాల్లో తిరిగే ‘హెలికాప్టర్ మంత్రులు’గా పేరొందారని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయకట్టు అంటే ఏంటో, నీళ్లు అంటే ఏంటో కనీస అవగాహన సున్నా అని విమర్శించారు. రైతాంగ సమస్యలపై ఆయన ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించారు.
ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి రోడ్ల పేరుతో నానా హంగామా చేస్తున్నారని, రేపు గ్రామీణ రోడ్లపై కూడా టోల్ ప్లాజాలు పెట్టి ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. గతంలో యాదాద్రి పవర్ ప్లాంట్ వద్దు, కూలగొడతాం అని ప్రగల్భాలు పలికిన ఈ దుర్మార్గులు.. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు అంతర్గతంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
తుంగతుర్తిలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే
రాబోయే రోజుల్లో తుంగతుర్తి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడటాన్ని ఒక యజ్ఞంలా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం నిర్వహించిన అంతర్గత సర్వేల ప్రకారం తుంగతుర్తిలో 64 శాతం మంది ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గాదరి కిషోర్ కుమార్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో సువర్ణయుగం నడిచిందని, కేసీఆర్ను వదులుకుని ప్రజలంతా ఇప్పుడు నష్టపోయామని బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే అని జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.