తుని చిన్నారి మిస్టరీ..! వింతగా ప్రవర్తిస్తూ మళ్లీ ఇంటికే వచ్చిన శునకం మృతి.. జాను ఆచూకీపై వీడని ఉత్కంఠ

తుని/కాకినాడ, ఏపీబీ న్యూస్: కాకినాడ జిల్లా (Kakinada District) తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఏడో రోజుకూ లభ్యం కాలేదు. అటవీ ప్రాంతం, కొండలు, పామాయిల్ తోటల్లో దాదాపు 250 మందికి పైగా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ (SDRF), అటవీ శాఖ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నా ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. ఈ క్రమంలో కేసులో కీలకమైన పెంపుడు కుక్కపై పోలీసులు చేసిన సరికొత్త సాంకేతిక ప్రయోగం కూడా నిరాశనే మిగిల్చింది.

సుంకర గణేష్, భవాని దంపతులు గత కొన్ని ఏళ్లుగా సీహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ అక్కడే నివసిస్తున్నారు. గత శనివారం (జూన్ 6న) వీరి రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ అడవి వైపు వెళ్లి అదృశ్యమైంది.

తిరిగొచ్చిన కుక్క – వింత ప్రవర్తన: చిన్నారితో పాటు అడవిలోకి వెళ్లిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత ఒంటరిగా కొండపై నుంచి కిందకు వచ్చింది. అప్పట్లో దాన్ని పట్టుకోవాలని చూస్తే స్థానికులపై దాడి చేసి కరిచే ప్రయత్నం చేసింది.

హైదరాబాద్ టీమ్ జీపీఎస్ స్మార్ట్ ప్లాన్: కుక్క వెళ్లిన మార్గంలోనే పాప జాడ దొరుకుతుందన్న ఆశతో, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం ఆ పెంపుడు కుక్క మెడకు జీపీఎస్ (GPS Tracker) కాలర్ను అమర్చి అడవిలోకి వదిలారు.

నిరాశ పరిచిన ఫలితం: ఆ శునకం కొద్దిసేపు సమీపంలోని కొండ చుట్టూ తిరిగి, మళ్లీ వెనక్కి ఇంటికే వచ్చేసింది. దీంతో ఆ కుక్క ఇప్పటికే పాప ఉన్న లొకేషన్ వాసన (Scent) కోల్పోయి ఉంటుందని లేదా దాని ప్రవర్తన వింతగా మారిందని అధికారులు భావిస్తున్నారు. దాన్ని నమ్ముకుంటే చిన్నారి ఆచూకీ దొరకడం కష్టమని స్థానికులు కూడా పెదవి విరుస్తున్నారు.

మరోవైపు, ఖనిజాలను గుర్తించడంలో నిపుణుడైన మూర్తి అనే వ్యక్తి.. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీల (Silver Ornaments) ఆధారంగా మెటల్ డిటెక్టర్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల నుండి ఆమె వాడిన మరో వెండి వస్తువును తీసుకుని డిటెక్టర్తో వెతికినా ఇంకా ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు.

ఈ కేసు అత్యంత సున్నితంగా మారడం, సామాజిక మాధ్యమాల్లో పాప పాత వీడియోలు వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా ఈ కేసును నిశితంగా పరిశీలిస్తోంది. చిన్నారి గురించి సమాచారం ఇస్తే రూ. 1 లక్ష నగదు బహుమతి ఇస్తామని జిల్లా ఎస్పీ ప్రకటించారు.

Share
Share