- బీపీఎల్ కోటాలోనే జర్నలిస్టులకు ఇళ్ల జాగలు
- ప్రభుత్వ అనుమతి కోరనున్న మంత్రి కోమటిరెడ్డి
- నిరుపేదలతోపాటే, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు
- దాంతోపాటు ఒకేసారి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇళ్ల జాగల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న జర్నలిస్టుల కల త్వరలో నెరవేరనుంది. 2008 నుంచి ఇళ్ల జాగల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు ఎట్టకేలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే చట్ట ప్రకారం సొసైటీలు, అసోసియేషన్ల, సంఘాల పేర్లతో ఇళ్ల జాగలు ఇవ్వడం కుదరదు. కాబట్టి దారిద్ర్యరేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే కోటాలోనే జర్నలిస్టులకు ఇళ్ల జాగలు ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరనున్నట్టు తెలిసింది. నల్లగొండలో ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకంగా కాలనీ నిర్మిస్తానని చెప్పిన మంత్రి, ఇళ్ల జాగల లేని నిరుపేదలకు కూడా పట్టాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారో అధికారికంగా లెక్కలు తీశాక, దాని ప్రకారం అవసరమయ్యే భూమిని సేకరిస్తారు.
గతంలో ఎస్సీల కోసం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో భూసేకరణ చేశారు. కానీ అక్కడ ఎవరూ ఇళ్లు కట్టుకోలేదు. ఎస్సీలకు ప్రత్యామ్నయంగా అన్ని రకాల వసతులు కలిగిన ఇళ్ల జాగలను ఇప్పిస్తే వాటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. కానీ నల్లగొండ పట్టణానికి చాలా దూరంలో ఉన్నందున పట్టణానికి అత్యంత సమీపంలోనే జర్నలిస్టులకు ఇళ్ల జాగలు ఇస్తే బాగుంటుందని జర్నలిస్టులు కోరుతున్నారు. ఇళ్ల జాగలతో పాటు, ఒకటేసారి ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేస్తారని అధికారులు చెప్పారు.
ఇదిలావుంటే ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జర్నలిస్టులకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని వేర్వేరు అవసరాలకు ఎప్పుడో మళ్లించారు. కొందరు రైతులు ఆక్రమించారు. కాబట్టి ఆ స్థలం పైన పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉన్నందున అప్పటిలోగా జర్నలిస్టుల సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయ పడుతున్నారు.