APB News Exclusive: Episode-7: కతాలగూడ భూముల్లో.. ‘రియల్’ మోసం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ పరిధిలోని కతాలగూడ భూముల వ్యవహారంలో రియల్టర్ల మోసం బట్ట బయలైంది. రెవిన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్ను చూపించి కోట్లు విలువ చేసే దాదాపు ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఆధారాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఇందులో రియల్టర్లు రెవిన్యూ అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఏపీబీ’ వరుస కథనాలతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టగా, ఇప్పటికే కొన్ని భూములకు సంబంధించిన అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు రెవిన్యూ ఆఫీసర్లు రికార్డుల్లో పట్టేదారు పేర్లు తొలగించడం, రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఇళ్ల స్థలంగా మార్చి నమోదు చేయడం వంటి చర్యలు కూడా వెలుగు చూస్తుండం, అక్రమార్కుల పైన ఇప్పటి వరకు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కతాలగూడ భూముల వ్యవహారం మరింత వివాదస్పదంగా మారింది.

కతాలగూడ సర్వే నంబర్ 504/ఈ4, 505/ఆ2లో ఉన్న 12.50 గుంటల చెరువు బాట స్థలాన్ని మిస్సింగ్ సర్వే నంబర్ ముసుగులో రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులు కొత్త డ్రామాకు తెరతీశారు. పజ్జూరి ఇంద్రయ్య పేరుతో 504, 505 సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని తాజాగా రెవిన్యూ రికార్డుల్లో ఇళ్ల స్థలంగా మార్చడంతో వివాదం మరింత  ముదిరింది. ఈ భూముల వ్యవహారం పై ‘ఏపీబీ’ ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన అధికార యంత్రాంగం రికార్డులను లోతుగా పరిశీలించింది. ఈ క్రమంలో మొదటి నుంచి పక్కా ప్రణాళికతో భూముల అక్రమాలు జరిగినట్లు తేలడంతో, అసలు పట్టేదారులను తాము ఎప్పుడూ చూడలేదని, రియల్టర్లు, కొందరు రైతులు కలిసి తప్పుదోవ పట్టించారని రెవిన్యూ అధికారులు చెబుతుండటం  విస్మయానికి గురిచేస్తోంది. పని ఒత్తిడి కారణంగా పొరపాట్లు జరిగాయని భావించినా, వాటిని సరిదిద్దాల్సిన అధికారులు మరోసారి రికార్డుల్లో మార్పులు చేయడం అనుమానాలకు తావిస్తోంది. జరిగిన తప్పులను సవరించాల్సిన చోట, రికార్డులను తారుమారు చేసి అక్రమాల నుంచి బయటపడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీబీ కథనాలకు ముందు పజ్జురి ఇంద్రయ్య పేరు మీద భూ భారతిలో 5.50(Ac. Gts) భూమి
ఏపీబీ కథనాలకు ముందు పజ్జురి ఇంద్రయ్య పేరు మీద భూ భారతిలో 4.40(Ac. Gts)భూమి

పజ్జూరి ఇంద్రయ్య పేరుతో మిస్సింగ్ సర్వే నంబర్ కింద భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సంగతి వాస్తవం అని సిబ్బంది అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను విచారించిన పిదప, ఆ భూమి ఇంద్రయ్యదే అని సాక్షులు చెప్పడంతో అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశామని ఆఫీసర్లు స్పష్టం చేశారు. ఈ అక్రమాలన్నీ వెలుగులోకి రావడంతో రిజిస్ట్రేషన్ రద్ధు చేయాల్సిన ఆఫీసర్లు రికార్డులను మాయం చేసే పనిలో పడ్డారు. ఎందుకంటే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మిస్సింగ్ సర్వే నంబర్ రిజిస్ట్రేషన్ కలెక్టర్ ఆమోదంతోనే జరుగుతాయి. కానీ తప్పు జరిగిందనే సంగతి కలెక్టర్ దృష్టికి వెళితే మొదటికే మోసం వస్తుందని భావించి గుట్టుచప్పుడు కాకుండా రికార్డులను తారుమారు చేశారు. 504, 505 సర్వే నంబర్లలో ఇంద్రయ్య పేరు రికార్డులను తొలగించారు. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని ఇళ్ల జాగ కింద మార్చారు. 504లో 5.50 గుంటలు, 505లో 4.50 గుంటల జాగ ప్రభుత్వ స్థలమని, ఇళ్ల జాగ కింద రికార్డుల్లో చేంజ్ చేశారు. కొద్దిరోజుల క్రితం వరకు ఇంద్రయ్య పేరు మీదున్న ల్యాండ్  ఉన్నపళంగా ప్రభుత్వ స్థలంగా మారింది. ఇంద్రయ్య పేరు మీద ఉన్నప్పుడు మార్కెట్ విలువ ప్రకారం రూ.42 లక్షలు కాగా, రెండు కార్లు పంట సాగవుతుందని రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఇప్పుడు అదే భూమి ఇళ్ల జాగ అని, ప్రభుత్వ స్థలంగా రికార్డుల్లో మార్చేసి, అసలు రికార్డుల్లో ఇంద్రయ్య పేరు లేకుండా మాయం చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.

ఏపీబీ కథనాల తర్వాత పజ్జురి ఇంద్రయ్య పేరు భూ భారతిలో తొలగింపు

ఇంద్రయ్య పేరును రికార్డుల నుంచి తొలగించి, వ్యవసాయ భూమిని ప్రభుత్వ ఇళ్ల జాగల కింద మార్చడం వరకు బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అసలు భూమి ఎక్కడ ఉందో గుర్తించకుండా రికార్డులు మార్చడం వల్ల ఎవరికి ప్రయోజనం అనేది అధికారులకే తెలియాలి. ఎందుకంటే 504, 505 లో 30 ఎకరాల్లో వెంచర్ పనులు జరుగుతున్నాయి. ఇంద్రయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన జాగలోనే రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహారి గోడ నిర్మించారు. ఇందయ్య పేరు మీదున్న భూమిని రియల్టర్లకు భేరం పెట్టడంతో ఆ ప్రాంతంలో చురుగ్గా పనులు నడుస్తున్నాయి. కానీ అధికారులేమో ఆ భూమిని ఇళ్ల జాగల కింద రికార్డుల్లో చేంజ్ చేశారు. రికార్డుల్లో మార్చిన జాగను అధికారులు పరిశీలించి, సర్వే చేసి హధ్దులు ఖరారు చేయాలి. కానీ ఇవేమీ చేయకుండా కేవలం రికార్డుల్లో పేర్లు తొలగించడం అంటే అధికారులు రియల్టర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు దీన్నిబట్టి తెలస్తోంది. అంతేగాక ఇదే ఏరియాల్లో ఇంకొన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన సంగతి కూడా ఏపీబీ బయట పెట్టింది. ఆ భూముల లెక్కలను తేల్చకుండా రికార్డులను తారుమారు చేయడం పైనే అధికారులు ఫోకస్ పెట్టడం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Share
Share