- 59 మొక్కలు నాటిన ఎమ్మెల్యే దంపతులు..
- నోట్‌బుక్స్, పెన్నులు గిఫ్ట్‌గా ఇచ్చిన నేతలు
- కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజల మధ్య కేక్ కట్ చేసిన రాజగోపాల్ రెడ్డి
- రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన మునుగోడు కాంగ్రెస్ యువత
- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రత్యేక శుభాకాంక్షలు
మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 59వ జన్మదిన వేడుకలు మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ ప్రజలు, ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల మధ్య ఆయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
పర్యావరణ హితంగా.. 59 మొక్కలు నాటిన దంపతులు:
తన 59వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాజగోపాల్ రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మొక్కల పెంపకం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి ఆయన మొక్కలు నాటారు. తన 59 ఏళ్ల వయసుకు సూచికగా.. నియోజకవర్గ ప్రజలతో కలిసి మొత్తం 59 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై తనకున్న మక్కువను చాటుకున్నారు.
రక్తదాన శిబిరం: అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం హాల్లో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి బర్త్డే సందర్భంగా రక్తాన్ని డొనేట్ చేయడానికి యువకులు పెద్ద ఎత్తున తరలిరాగా.. వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు.
కుటుంబ సమేతంగా కేక్ కటింగ్.. వేద ఆశీర్వచనాలు:
ఈ జన్మదిన వేడుకల కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రముఖ వేద పండితులు రాజగోపాల్ రెడ్డి దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కుమారుడు సంకీర్త్ రెడ్డి, కోడలు తరుణ్య, మనమరాలు వాన్యతో పాటు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు.
తరలివచ్చిన ప్రముఖులు.. బొకేలు వద్దు – బుక్స్ ముద్దు!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి బర్త్డే విషెస్ చెప్పడానికి మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నియోజకవర్గానికి చెందిన అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు తరలివచ్చి శుభాకాంక్షల వెల్లువ కురిపించారు.
ప్రముఖుల రాక: భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మునుగోడు క్యాంపు ఆఫీసుకు చేరుకుని రాజగోపాల్ రెడ్డి కి శాలువాలు కప్పి, ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆదర్శవంతమైన పిలుపు: తన పుట్టినరోజుకు ఎవరూ అనవసర ఖర్చులతో కూడిన బొకేలు, శాలువాలు తీసుకురావద్దని.. వీలైతే పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాలని రాజగోపాల్ రెడ్డి ముందే పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు స్పందించిన నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున నోట్ బుక్స్, పెన్నులను ఆయనకు ప్రెసెంట్ చేశారు. వీటిని త్వరలోనే నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
తన 59వ జన్మదిన వేడుకలను ఇలా హంగూ ఆర్భాటాలు లేకుండా, నియోజకవర్గ ప్రజల మధ్య, కన్నవారిలాంటి కుటుంబ సభ్యులతో కలిసి గడుపుకోవడం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.