APB News Exclusive: అధికారుల క్లబ్ లో.. అక్రమాల ఆట!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ‘నల్లగొండ క్లబ్’ లో అక్రమంగా పేకాట ఆడుతున్నట్టు బలమైన ఫిర్యాదులు వచ్చాయి. ఆఫీసర్ క్లబ్ అనే కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం ఇల్లీగల్ వ్యవహరాలు నడిపిస్తున్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. 600 మంది సభ్యత్వం కలిగిన క్లబ్ లో మేనేజ్మెంట్ కమిటీలో 24మంది మెంబర్స్ ఉన్నారు. వీళ్లలో కలెక్టర్, ఎస్పీని మినహాయిస్తే మిగితా 22 మందిలో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు, పలు కమిటీలకు సభ్యులుగా కొనసాగుతున్నారు. క్లబ్ బైలా ప్రకారం క్యారమ్స్, చెస్ లాంటి గేమ్స్ మాత్రమే ఆడాలి. కానీ అర్ధరాత్రి వరకు పేకాట ఆడటం విమర్శలకు తావిస్తోంది. ఒక్కో ఆటకు రూ.200 నుంచి రెండువేల వరకు నగదు లావాదేవీలు నడుస్తున్నాయి. దీనికి తోడు బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉండటంతో అర్థరాత్రి వరకు మద్యం అందుబాటులోనే దొరుకుతుంది. నల్లగొండలో బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ లు మూతపడ్డా గానీ.. క్లబ్ లో మాత్రం అర్ధరాత్రి వరకు మద్యం దొరుకుతుందనే టాక్ బహిరంగంగానే వినిపిస్తోంది. ఒకేచోట పేకాట, మద్యం లభిస్తుండటంతో హైదరాబాద్ నుంచి కూడా పేకాటరాయుళ్లు నల్లగొండ బాట పడుతున్నారు. 600 మంది సభ్యుల్లో సగానికి పైగా హైదరాబాద్ లోనే నివసిస్తుండటంతో పేకాట ఆడటం నల్లగొండలో సులభంగా మారింది. ప్రతిరోజు సాయంత్రం 4గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు పేకాట ఆడేందుకు క్లబ్ లో కార్లు, బైక్ లు బార్లు తీరుతున్నాయి. టేబుళ్లు ఖాళీ దొరక్కపోవడంతో కొత్తగా క్లబ్ పైన మరో అంతస్థు నిర్మించారు. క్లబ్ బిల్డింగ్ పైన కొత్తగా నిర్మించిన భవనం గురించే సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలను అడ్డంపెట్టుకుని క్లబ్ లో జరుగుతున్న పేకాట పర్వం అడ్డు అదుపూ లేకుండా పోయింది. థర్టీన్ కార్డ్స్ ఆట ఆడొచ్చని హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని, ఆ మేరకు రూ.200, 300లతో పేకాట ఆడుతుంటారని సెక్రటరీ చల్లా వెంకటరమణ ‘ఏపీబీ ప్రతినిధికి’ చెప్పారు. కానీ నిజంగా లోపల దీనికి వ్యతిరేకంగా ఒక్కో ఆటకు వెయ్యి, రెండువేల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక్కడే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, ఇతర దందాలకు సంబంధించి సెటిల్మెంట్లు జరుగుతుంటాయని సభ్యులు చెప్తున్నారు. క్లబ్ పైన కొత్త భవనం నిర్మాణంలో ఉందని, ఇంకా పూర్తికాలేదని, ఏమైన సమాచారం కావాలంటే లిఖితపూర్వకంగా అడిగితే ఇస్తామని వెంకటరమణ ఏపీబీతో చెప్పడం గమనార్హం.

22 మంది కమిటీ సభ్యుల్లో పలువురు కీలక సభ్యులు వ్యవహారిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. కొన్ని లక్షల రూపాయాలతో కొత్తగా నిర్మించిన అధనపు బిల్డింగ్ గురించి కమిటీ సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదు. జనరల్ బాడీ తీర్మానం లేకుండానే కేవలం కమిటీ సభ్యుల ఆమోదం తోనే పనులు చేపట్టారు. ప్రతి ఆరు నెలల కోసారి జనరల్ బాడీ పెట్టాలనే నిబంధన ఉంది. కానీ క్లబ్ అభివృద్ధి కార్యక్రమాలకు జనరల్ బాడీతో సంబంధం లేదని, కేవలం ఈసీ మెంబర్స్ ఆమోదిస్తే చాలని సెక్రటరీ చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. 22 మందిలో 10 మంది రెడ్లు కాగా, 12 మంది ఇతర వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి క్లబ్ పైన ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులే ఏలుతున్నారు. 600 మంది సభ్యుల్లో సగానికి పైగా షాడో సభ్యులే. వీరంతా హైదరాబాద్లోనే ఉండటంతో అసలు క్లబ్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలక్షన్ల సమయంలో బందుత్వాన్ని, కులాన్ని అడ్డంపెట్టుకుని గెలవడం తప్పా ఇంకో వర్గానికి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అయ్యే ఛాన్స్ ఇవ్వడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. నిష్పక్షపాతంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నా లోపాయికారికంగా జరిగే రాజకీయాల వల్ల ఒకే వర్గం క్లబ్ పైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని మరో వర్గం ఆరోపిస్తోంది.

పేకాట ఆడటం వల్ల క్లబ్ కు రోజుకు 20 వేల ఆదాయం వస్తోందని, దాంతోనే కమిటీ సభ్యులు పేకాటను తెరవెనక నుంచి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. పైగా బార్ అండ్ రెస్టారెంట్ నడవాలంటే అర్ధరాత్రి వరకు పేకాట ఆడితే తప్పా రాబడి ఉండదు. రెస్టారెంట్ రాబడి పెరిగితే తప్పా క్లబ్ కు రావాల్సిన ఇన్ కం పెరుగుతుంది. ఇప్పటికే క్లబ్ సభ్యత్వాన్ని రూ.50 వేల నుంచి రెండు లక్షలకు పెంచారు. జీఎస్టీ(GST)తో కలిపి అదికాస్తా రెండున్నర లక్షలకు చేరింది. బైలా ప్రకారం క్లబ్ ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి. జమ, ఖర్చుల వ్యవహారాలన్నింటి పైన జిల్లా కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. కానీ అసలు క్లబ్ కు వస్తున్న ఆదాయం గురించి, ఖర్చుల గురించి రెండున్నర లక్షల సభ్యత్వం తీసుకున్న సభ్యులకు, ఈసీ మెంబర్స్ కు ఎలాంటి సమాచారం ఉండదని చెప్తున్నారు. క్లబ్ ఆదాయ, వ్యయాల పైన జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆడిట్ చేయించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.

మాజీ కలెక్టర్ సయ్యద్ అలీ మూర్తూజా రిజ్వీ హయాంలో ఇదేవిధంగా క్లబ్ పైనే ఆరోపణలు రావడంతో ఆయన సీరియస్ గా స్పందించారు. క్లబ్ నోటీసు బోర్డు పైన తన ప్రమేయం లేకుండా అధ్యక్షుడి హోదాలో తన పేరు పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో అప్పటి కమిటీ కలెక్టర్ పేరును తీసేసింది. కానీ రిజ్వీ ఇక్కడి నుంచి వెళ్లిపోయాక మళ్లీ అదే పద్ధతిలోనే కలెక్టర్, ఎస్పీ పేర్లను నోటీసు బోర్డు మీద పెద్దపెద్ద అక్షరాలతో ముద్రిస్తున్నారు. రిజ్వీ హయాంలోనే క్లబ్ ఆర్ధిక లావాదేవీల పైనే విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన విచారణకు ఆదేశించి చర్యలు తీసుకున్న సంగతిని కూడా సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అతి త్వరలో కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో క్లబ్ లో చోటుచేసుకున్న పేకాట కలకలం ఎటువైపు దారితీస్తోందో వేచి చూడాల్సిందే.

Share
Share