Breaking News:ఏసీబీ మెరుపు దాడి: రూ. 2 లక్షల లంచంతో దొరికిపోయిన సైబర్ క్రైమ్ సీఐ..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజధానిలోని నాంపల్లిలో ఉన్న సైబర్ క్రైమ్ బ్యూరో ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏసీబీ అధికారులు సంచలనాత్మక దాడి జరిపారు. సైబర్ క్రైమ్ విభాగంలో ఇన్స్పెక్టర్గా (సీఐ) విధులు నిర్వహిస్తున్న మహేందర్.. ఓ కేసు వ్యవహారంలో బాధితుల నుండి రూ.2 లక్షల నగదును లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ బృందం పక్కా వ్యూహంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.

నగరానికి చెందిన ఓ బాధితుడు సైబర్ మోసానికి గురై నాంపల్లి సైబర్ క్రైమ్ బ్యూరోలో గతంలో ఫిర్యాదు చేశారు.

బాధితుడిపైనే సీఐ ఒత్తిడి: సదరు కేసును దర్యాప్తు చేస్తున్న సీఐ మహేందర్.. నిందితులను పట్టుకోవాలన్నా, లేదా బాధితుడికి న్యాయం జరిగేలా ఫైల్ ముందుకు కదపాలన్నా తనకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

రూ.2 లక్షలకు ఒప్పందం: చివరికి రూ.2 లక్షలు ఇచ్చుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితుడు.. ఇన్స్పెక్టర్ అడిగిన లంచం ఇచ్చుకోలేక రహస్యంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ అధికారుల ముందస్తు వ్యూహం ప్రకారం.. శనివారం సాయంత్రం బాధితుడు నాంపల్లిలోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లారు. సీఐ మహేందర్ తన చాంబర్లోనే ఆ లంచం సొమ్ము రూ.2 లక్షలను తీసుకుంటుండగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని అధికారులు మెరుపు వేగంతో దాడి చేసి ఆయన్ను చుట్టుముట్టారు.

సీఐ మహేందర్ చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నాంపల్లి సైబర్ క్రైమ్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐ మహేందర్ గతంలో డీల్ చేసిన కొన్ని కీలక సైబర్ కేసుల ఫైళ్లను, కంప్యూటర్ రికార్డులను కూడా అధికారులు ఆధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోయి న్యాయం కోసం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎంతో నమ్మకంతో వచ్చే ఇలాంటి బాధితులను ఆదుకోవాల్సిన దర్యాప్తు అధికారే.. వారి వద్దే రూ.లక్షల్లో లంచాలు డిమాండ్ చేయడం అత్యంత సిగ్గుచేటు. టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరగాళ్లను పట్టుకోవాల్సిన స్థానంలో ఉండి, అవినీతికి పాల్పడిన ఇలాంటి అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందని ‘ఏపీబీ న్యూస్’ అభిప్రాయపడుతోంది.

Share
Share