APB News Exclusive: ‘హైబ్రిడ్ కాంగ్రెస్’ తో జగదీష్ హీట్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు”, “హైబ్రిడ్ కాంగ్రెస్లో వారు ఇమడలేకపోతున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు బయటకు కాంగ్రెస్పై దాడిలా కనిపించినా.. లోపల మాత్రం సొంత పార్టీ నేతలకే రాజకీయ సంకేతాలిచ్చినట్టుగా చర్చ నడుస్తోంది. నల్లగొండ కలెక్టరేట్ వద్ద సోమవారం మహాధర్నా వేధిక పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖలు హాట్ టాపిక్ గా మారాయి.

మహాధర్నా వేదికపై జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అక్కడే ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల హరీష్ రావు పర్యటనతో అవికాస్తా బహిర్గతమయ్యాయి. అధికారానికి దూరమైన తర్వాత పలు నియోజకవర్గాల్లో నాయకత్వ పోరు పెరిగింది. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ యాక్టివ్ అవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. మరికొందరు తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో “కాంగ్రెస్ నుంచి ఒరిజినల్ నేతలు వస్తున్నారు” అన్న జగదీష్ వ్యాఖ్యలు.. ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకుల స్థానాలపైనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు “పార్టీ మళ్లీ కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తుందా?” అని ఆందోళన చెందుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏకతాటిపై కనిపించిన బీఆర్ఎస్ నాయకత్వం ఓటమి తర్వాత మళ్లీ వర్గాలుగా విడిపోయింది. ముఖ్యంగా కోదాడ, హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, ఆలేరు, నకిరేకల్, నల్లగొండలో నాయకత్వ పోటీ మళ్లీ పెరిగిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎవరి నియోజకవర్గంలో ఎవరు యాక్టివ్గా ఉండాలి? పార్టీ కార్యక్రమాల్లో ఎవరికీ ప్రాధాన్యం? భవిష్యత్తులో టికెట్లు ఎవరికి? అనే అంశాల పై లోపల చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జగదీష్ చేసిన వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్పై విమర్శలకే పరిమితం కాకుండా.. పార్టీలో ఎవరి మాట నడవాలి?” అన్న అంతర్గత శక్తిని కూడా ప్రశ్నిస్తున్నాయి.

జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల పంపకం, నియోజకవర్గాల ఆధిపత్యం, స్థానిక వర్గపోరుల కారణంగా అసంతృప్తి తీవ్రమైంది. అదే అంశాన్ని టచ్ చేస్తూ జగదీష్ రెడ్డి హైబ్రిడ్ కాంగ్రెస్” వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్లో సీనియర్, ఒరిజినల్ నేతలు పక్కన పడుతున్నారన్న భావనను బలపరిచి.. వారిని బీఆర్ఎస్ వైపు తిప్పాలన్న వ్యూహంగా దీన్ని కొందరు విశ్లేషిస్తు న్నారు. నల్లగొండ, నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో పలువురు కీలక నేతలతో సహా, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు, తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారంతా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నామినేటెడ్ పదవులు రాకపోవడంతో ఇక పార్టీలో ఉండటం ఇష్టంలేక బీఆర్ఎస్ లోకి వస్తామని సంకేతాలు పంపిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు.

జగదీష్ రెడ్డి చెప్పినట్టుగా నిజంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న నాయకులు ఎవరన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇంకా మూడేళ్లు అధికారంలో ఉండగా, ఇప్పటికిప్పుడు సీనియర్ నేతలు పార్టీ మారే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రధానంగా రాజకీయ ఒత్తిడి పెంచడానికేనా? లేక పార్టీలోని సొంత నాయకులకు హెచ్చరికలా? అనే చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాల కోసం ఇప్పటినుంచే బీఆర్ఎస్లో అంతర్గత కసరత్తు మొదలైందన్న అభిప్రాయం జగదీష్ వ్యా ఖ్యలను బట్టి అర్ధమవుతోంది. కాంగ్రెస్ అసంతృప్తులను ఆకర్షించడం ఒక వైపు అయితే.. మరోవైపు సొంత పార్టీలో యాక్టివ్గా మారుతున్న మాజీ ఎమ్మెల్యేల రాజకీయ అడుగులను కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే వ్యూహాం కూడా కనిపిస్తోంది.

Share
Share