APB News Exclusive: ఒక మంత్రి  ‘రా…బే’అంటడు.. ఇంకో మంత్రి ‘ల’ మించి దిగడు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, సూర్యాపేట జిల్లా మంత్రులు రాత్రి అయితే చాలు బూతు పురుణం ఎత్తుకుంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా జగదీష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. నల్లగొండ మంత్రి ఎలాంటి భాష మాట్లాడుతడో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ల కు బాగు ఎరుక అని, ఆయన ఫోన్ ఎత్తాలంటేనే కాంగ్రెస్ లీడర్లు గజగణ వణికిపోతున్నారని మంత్రి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి ‘రా.. బే’ అని అసభ్యకరంగా, అవమానకంగా మాట్లాడతని, దాంతో అధికారులు సైతం రాత్రి కాగానే ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్నారని అన్నారు. వడ్ల కొనుగోళ్లు సంగతి పక్కన పెట్టి ఫలానా మిల్లరు వచ్చి కల్వలేదు..? నాకాడికి రాకుండా నువ్వేమన్న దొబ్బితిన్నవా? అని అధికారులను వేధిస్తుంటాడని, దండంపల్లి, ఆర్జాల బావి సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు ఎలా ఉన్నాయో ఆరా తీయాల్సిన మంత్రి ఫలానా మిల్లరు ఎందుకు కల్వడం లేదని వాడి పనిపట్టు అని అధికారుల పైన ఒత్తిడి చేస్తుంటాడని మంత్రి కోమటిరెడ్డి పైన పరోక్ష విమర్శలు చేశారు.

ఇక సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘ల’ అనే పదం నుంచి దిగడని, రోజుకు 18 గంటలు రైతుల కోసం కష్టపడుతున్నామని చెప్తున్న ఈ ఇద్దరు మంత్రులు రాత్రి అయితే బూతుపురాణం ఎత్తుకుంటారని, ఎద్దేవ చేశారు. వడ్ల కొనుగోళ్ల పైన సీజన్ కు ముందే సమీక్షించాల్సిన మంత్రులకు హెలికాప్టర్లు దొరక్కా రివ్యూలు పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిల్లర్లతో ఇద్దరు మంత్రులు కుమ్మక్కయ్యారని, వీళ్ల వైఖరి కారణం గానే బస్తాకు 20 కిలోల కటింగ్ పెడుతున్నారని, ఇదేందని మిల్లర్లను నిలదీసేందుకు ప్రయత్నిస్తే మంత్రులకు ఇచ్చిన డబ్బులు ఎవడు ఇస్తాడని రివర్స్లో రైతుల పైన తిరగబడుతున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. నిజానికి మంత్రుల పర్యటనకు ముందు బస్తాకు పది కిలోల కటింగ్ పెడితే వీళ్లు వచ్చిపోయాక 20 కిలోలు కటింగ్ చేస్తున్నారని, దండెంపల్లి కొనుగోలు సెంటర్లోనే ఒక్క రోజే 112 క్వింటాళ్ల వడ్లు కట్ చేశారని దీనికి సంబంధించిన ఆధారాలను మంత్రి చూపెట్టారు. ఇద్దరు మంత్రులు మాట్లాడే తీరు ఇక్కడ చెబితే అంత మర్యాదగా ఉండదు కానీ.. చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నిన్నామొన్నటి వరకు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసిన మంత్రులిద్దరు హెలికాప్టర్లు దొరక్కా జిల్లాలో పర్యటించడం మానేశారని మంత్రి చెప్పారు. వీళ్లిద్దరు హెలికాప్టర్ మంత్రులు అయ్యారని, నేను మంత్రిగా ఉన్నప్పుడు రోజుకు ఐదారొందల(500-600) కిలోమీటర్లు కారులోనే ప్రయాణించే వాడినని, వడ్ల సీజన్లో ఏడాదికి 12 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించానని, కానీ ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఇన్నేళ్లలో ఒకట్రెండు సార్లు మాత్రమే రివ్యూ చేశారని, అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి వచ్చిండనో, లేదా జిల్లాకు వేరే మంత్రులు వచ్చినప్పుడు మినహా రైతుల జోలికి పోలేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Share
Share