- ఏసీబీ(ACB) ఆకస్మిక దాడుల్లో విస్తుగొల్పే అక్రమాలు
- రూ.16 కోట్ల పన్నుల బకాయిలు
- బిల్డింగ్ పర్మిషన్ల ఆదాయం జీరో
- ఎల్ఆర్ఎస్(LRS) ఆదాయం రూ.15 కోట్లు వసూలు కాలే
- ఎల్ఆర్ఎస్ నుంచి పెన్షన్ ఆప్లికేషన్స్ వరకు పెండింగ్
- రిజిస్టర్లు గల్లంతు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట జీతాలు స్వాహా
- అధికారుల వాహనాల వినియోగంలోనూ అక్రమాలే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారింది. గడిచిన రెండేళ్ల లో మున్సిపాలిటీలో చోటుచేసుకున్న అక్రమాల గుట్టు ఎట్టకేలకు బయటపడింది. గత రెండు రోజుల నుంచి అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) జరిపిన ఆకస్మిక దాడుల్లో విస్తుగొల్పే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఇంటి పన్నుల వసూళ్లు, షాపుల పైన విధించిన ట్యాక్సీలను వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట జీతాలు కొల్లగొట్టారు. అధికారులు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరు కావడం, రిజిస్టర్లు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం అనేక అవతవకలను అధికారులు గుర్తించారు. ఇంటి పన్నులు, షాపుల పైన విధించిన పన్నుల బకాయిలే దాదాపు రూ.16 కోట్లు పెండింగ్ ఉండటం గమనార్హం.
ఏసీబీ గుర్తించిన అక్రమాలు..
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.24.86 కోట్ల పన్ను అంచనా ఉండగా కేవలం రూ.9.17 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.15.68 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. అదే విధంగా మున్సిపాలిటీ లోని 1,756 షాపులకు రూ.43.3 లక్షల పన్ను విధించగా రూ.28.35 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. మరో రూ.14.95 లక్షలు బకాయిగా ఉన్నాయి. 2026-27లో 1,783 షాపులకు రూ.36.18 లక్షల పన్ను విధించగా కేవలం రూ.15.01 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రూ.21.1 7 లక్షలు పెండింగ్లో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. బకాయిలు అన్నీ కలిపితే మొత్తం రూ.16 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా వచ్చే ఆదాయం 2024-25లో రూ.3.29 కోట్ల నుంచి 2025-26లో రూ.3.05 కోట్లకు పడిపోయింది. అంటే బిల్డింగ్ పర్మిషన్ల ఆదాయం సున్నా.

అక్రమ నిర్మాణల పైన చర్యలు శూన్యం..
2025-26లో అక్రమ నిర్మాణాలపై మొత్తం 54 ఫిర్యాదులు వచ్చినప్పటికీ చాలా కేసుల్లో నోటీసులు జారీ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. తనిఖీల సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బోలుగూరి వెంకన్న అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు అధికారులు గుర్తించారు. చేయూత పెన్షన్, జనన మరణాల విభాగంలో 116 జనన దరఖాస్తులు, ఒక మరణ దరఖాస్తు ఏడు రోజుల గడువు దాటినా పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. ఎంట్రీలు నమోదు చేయకపోవడంతో 1,820 పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించకుండా పక్కన పడేశారు. 2025-26లో వచ్చిన 86 దరఖాస్తుల్లో 61 పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2026-27కు సంబంధించి 18 దరఖాస్తులు మాత్రమే వచ్చినప్పటికీ 34 ఆమోదించినట్టు రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపారు.
రిజిస్టర్ల నిర్వహణ అస్తవ్యస్తం..
బిల్డింగ్ పర్మిషన్, లే అవుట్ ఆక్రమణల రిజిస్టర్లు సరిగా నిర్వహించలేదని, కొన్ని రిజిస్టర్లపై అధికారుల సంతకాలు కూడా లేవని ఏసీబీ వెల్లడించింది. 21 రోజుల గడువు దాటినా బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై వచ్చిన 54 ఫిర్యాదులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్(LRS) సంబంధించిన 4,638 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా సుమారు రూ.15 కోట్ల ఆదాయం వసూలు కాకుండా ఉందని అధికారులు గుర్తించారు. వ్యక్తిగత నగదు రిజిస్టర్ నిర్వహణ లేకపోవడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గైర్హాజరైనా పూర్తి జీతాలు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించడం, నెలకు రూ.19,330 ఇంధన ఖర్చులు చూపించినప్పటికీ సరైన రికార్డులు లేకపోవడం, అధికారులకు కేటాయించిన వాహనాలకు లాగ్ బుక్స్ నిర్వహించకపోవడం వంటి అంశాలను ఏసీబీ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయనున్నట్లు ఏసీబీ(ACB) వెల్లడించింది.