APB News Exclusive: పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు.. టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలేనా?

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల పర్వం మూడు భవనాలు.. ఆరు ఫ్లోర్లు అన్న చందంగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న భవనాలు, రేకుల షెడ్ల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

జిహెచ్ఎంసి పరిధిలోని కీలక ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి:

ఉప్పల్ సర్కిల్లోని హెచ్ఎండిఏ (HMDA) లేఅవుట్ భగయత్, నాగోల్, న్యూ నాగోల్, బండ్లగూడ, కొత్తపేట ప్రాంతాలు, హయత్ నగర్ మరియు పెద్ద అంబర్పేట్ వంటి ప్రాంతాలలో భవన నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నాయి.

సిటిజన్స్ ఆన్లైన్ ద్వారా లేదా నేరుగా ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. ఫిర్యాదులు అందిన వెంటనే కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో కూల్చివేతలు వంటి కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల నుండి భారీగా వసూలు చేస్తూ అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

జిహెచ్ఎంసిలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో చెప్పడానికి ఇటీవల జరుగుతున్న ఏసీబీ దాడులే నిదర్శనం.

రెండు రోజుల క్రితం బోరబండ జిహెచ్ఎంసి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీలత లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక ఇంటి పర్మిషన్ కోసం ఆమె ఏకంగా ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అనుమతులు ఇవ్వకూడని భూములకు, ప్లాట్లకు సైతం లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇస్తూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.

ఈ అక్రమ నిర్మాణాలపై వివరణ కోరేందుకు ఉప్పల్, నాగోల్ సర్కిల్ ఏసీపీలను సంప్రదించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు. అధికారుల ఈ మౌనం అక్రమార్కులకు వరంగా మారుతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారుతుండటానికి ఈ అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణం. నాలాల కబ్జాలు, నిబంధనలు లేని కట్టడాల వల్ల భవిష్యత్తులో విపత్తులు సంభవించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీబీ న్యూస్ డిమాండ్ చేస్తోంది.

Share
Share