- ‘ఏ’ కేటగిరీలో ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్. .గ్రీన్ చానల్ నుంచి నిధులు
- ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్, బీ వెల్లంల ప్రాజెక్టులకు లైన్ క్లియర్
- ఎడమ కాలువ కిష్టాపురం వరకు పొడగింపు.. త్వరలోనే డిండి లిఫ్ట్ స్కీంకు గ్రీన్ సిగ్నల్
- వేసవిలోనే ఎక్కువ శాతం పనులు చేపట్టేందుకు చర్యలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టే సమయం ఆసన్నమైంది. టెండర్లు, భూసేకరణ, నిధుల సమీకరణ వంటి కీలకమైన సమస్యల నుంచి ప్రాజెక్టులు గట్టెక్కాయి. త్వరలోనే పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా శ్రీశైలం సొరంగ మార్గం టన్నెల్ ప్రాజెక్టును ప్రభుత్వం ‘ఏ’కేటగిరీలో చేర్చింది. ప్రభుత్వం ‘ఏ’కేటగిరీలో చేర్చిన ప్రాజెక్టులకు గ్రీన్చానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తోంది. ‘బి’కేటగిరీలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్, బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్, ఏలిమినేటి మాదవరెడ్డి ప్రధాన కాలువను చేర్చారు. 2028 మే నాటికి ప్రాజెక్టు పూర్తిచేసి, జూన్ 2న జాతికి అంకింతం చేయాలనే లక్ష్యంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సొరంగ పనులు స్పీడప్ చేశారు. ప్రస్తుతం సొరంగం తవ్వేందుకు రెండు చేతులు కలిగిన రాక్ బూమర్స్ వాడుతున్నారు. దీంతో రోజుకు ఇన్ లెట్, అవుట్ లెట్ కలిపి 6 మీటర్ల పని మాత్రమే జరుగుతోంది. త్వరలో మూడు చేతులు కలిగిన రాక్ బూమర్స్ తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి సాయంతో ప్రతి రోజు ఇన్ లెట్ 7 మీటర్లు, అవుట్ లెట్ 7 మీటర్లు కలిపి రోజుకు 14 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే 2028 మే నాటికి మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో మట్టి తోలకం..
సొరంగం ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 150 మీటర్లు వెనక్కి జరిగి, 45 డిగ్రీల పక్కకు వెళ్లి సొరంగం తవ్వుతున్నారు. ప్రాణ నష్టం జరగకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూలిపోయిన రాళ్లు, రప్పలు, మట్టిని ఎత్తి పోస్తున్నారు. సింగరేణిలో బొగ్గు గనుల తవ్వకాల్లో ఉపయోగించే టెక్నాలజీని సొరంగ మార్గం తవ్వకాల్లో వాడుతున్నారు. నైపుణ్యం కలిగిన జియోలిజిస్టుల సాయంతో ఎప్పటికప్పుడు మట్టి పరీక్షలు, సొరంగ పరిసర ప్రాంతాలను పరీక్షిస్తున్నారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఉగాది నుంచి పనులు పున:ప్రారంభం కగా ఇప్పటి వరకు 141 మీటర్లు తవ్వారు. మొత్తం 43.93 కిలోమీటర్లు కాగా, ఇన్లెట్ (నీరు లోపలికి వచ్చే ప్రదేశం) శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని దోమలపెంట వద్ద 29 మీటర్లు తవ్వగా, అవుట్ లెట్ (నీరు బయటకు వచ్చే ప్రదేశం) దేవరకొండ ప్రాంతం పనులు 111 మీటర్లు తవ్వారు.
ఏఎమ్మార్పీ మెయిన్ కెనాల్ వర్క్స్ షురూ..
ఎలిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు ప్రారంభమయ్యాయి. నల్లగొండలో సీసీ రోడ్లు నిర్మిస్తున్న బృందా కన్సల్టెన్సీ కాంట్రాక్టు కైవసం చేసుకుంది. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ముందుగా నల్లగొండ మండలం గుండ్లపల్లి వద్ద 22 కిలోమీటర్ నుంచి చెట్ల పొదలు (జంగిల్ క్లియరెన్స్) తొలగిస్తున్నారు. ప్రస్తుతం కాలువలో నీరు ప్రవహిస్తోంది. మరికొద్ది రోజుల్లో పై నుంచి నీటి విడుదల ఆపేసి నల్లగొండలోని ఐటీ(IT) టవర్స్ నుంచి పనులు మొదలు పెట్టనున్నారు. మళ్లీ జూన్, జులైలో కాలువలకు నీటిని విడుదల చేయాల్సి వస్తది. కాబట్టి ఈ రెండు, మూడు నెలల్లోనే మేజర్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నారు. 23 కిలోమీటరు అంగడీ పేట నుంచి అయిటిపాముల వద్ద మూసీ పరివాహక ప్రాంతం సమీపంలోని 136 కిలో మీటర్ వద్ద కలుస్తుంది.

బ్రహ్మణ వెల్లంల ఎడమ కాల్వకు గ్రీన్ సిగ్నల్..
బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎడమ కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పూణెకు చెందిన సన్బీం ఎంటర్ప్రైజెస్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గతంలో ఈ ఏజెన్సీ వెల్లంల సొరంగం మార్గం పనులు విజయవంతంగా పూర్తి చేసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపాధన మేరకు ఎడమ కాలువను మునుగోడు మండలం కిష్టాపురం వరకు పొడగించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సర్వే జరుగుతోంది. కిష్టాపురం, చిన్నకాపర్తి, తాళ్లవెల్లంల, ఎలకట్టే వరకు సర్వే పూర్తియ్యింది. వచ్చే మూడు నెలల్లో సర్వేతో పాటు, రైతులకు భూముల నష్ట పరిహారం కూడా చెల్లిస్తారు. ప్రస్తుతం భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులు జరుగుతున్నాయి. ఎడమ కాలువ పరిధిలో 143 మైనర్లు, డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. 43 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో 5 కోట్లు ఖర్చు కాగా, బ్యాలెన్స్ రూ.38 కోట్లతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ప్రాజెక్టును ‘బి’కేటగిరీలో చేర్చారు. కుడి కాలువ మహేందర్ రెడ్డి ఇన్ఫ్రాకు అప్పగించేందుకు స్క్రూటీనీ జరుగుతోంది. ఈ కాలువ పొడవు 25.5 కిలోమీటర్లు కాగా, 57 వేల ఎకరాల ఆయకట్టు అంచనా వ్యయం రూ.78 కోట్లు, ఏజెన్సీ ఫైనల్ కాగానే భూసేకరణ త్వరితగతిన పూర్తిచేస్తారు. గతంలో అభ్యంతరం చెప్పిన వట్టిమర్తి, వనిపాకల గ్రామాల ప్రజలు సైతం భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వట్టిమర్తి వద్ద మెయిన్ కెనాల్ క్రాసింగ్ వర్క్ ఉంది. నేషనల్ హైవే అథారిటీతో కాలువ డైవర్షన్ గురించి చర్చించాల్సి ఉంది. అయిటిపాముల ప్రాజెక్టుకు మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రాజెక్టు పైప్లై న్ నడుస్తోంది, కానీ పంపుహౌజ్ కట్టేందుకు రెండేళ్ల సమయం పడుతుంది.

డిండి లిఫ్ట్ స్కీంకు ఇంకాస్తా టైం..
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు ఇంకాస్తా సయమం పట్టనుంది. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల మధ్య నీటి పంపకాల వ్యవహారం పైనే చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలకు సమాన ఎత్తులో నీటిని ఇవ్వాలని నల్లగొండ ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏదుల వద్ద సర్వే జరుగుతోంది. ఈ సర్వే పూర్తికాగానే హెడ్ వర్క్స్ పనులు మొదలు పెడ్తారు. రెండు జిల్లాలకు సమాన ఎత్తులోనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సర్వే, డిజైన్ వర్క్స్ నడుస్తున్నాయి. టెండర్లు పూర్తియినందున పనులు ప్రారంభించడంలో జాప్యం ఉండకపోవచ్చని తెలుస్తోంది.