హాలియా, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో ఇచ్చిన హామీల అమలు లో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని, అబద్దాల మాటలతో ప్రజలను మోసం చేశారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. ఆదివారం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండల కేంద్రంలోని గాలి జంగయ్య ఫంక్షన్ హాల్ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా “రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి”అనే మాట వినిపిస్తోందని అన్నారు. నల్గొండ జిల్లాలో మిల్లర్ల వద్ద అవకతవకలు జరుగుతున్నాయని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పది రోజులు గడిచినా కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. క్వింటాకు 7 కిలోల కోత విధిస్తూ ధర తగ్గిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల బాధ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి కుర్చిని కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్లారని తీవ్రంగా విమర్శించారు.

బీఆర్ఎస్ హాయాంలో ప్రారంభించిన ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ సొరంగాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తొందని, సొరంగంలో ఇరుక్కుపోయిన కార్మికుల మృతదేహాలను కూడా వెలికితీయలేని పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, వడ్ల బోనస్ వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, కడారి అంజయ్య యాదవ్, చెన్ను సుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.