APB News Exclusive: ఉమ్మడి జిల్లాలో అగ్రవర్ణాలే ఆసాములు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో అత్యధిక సాగు భూములు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి.  ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సామాజిక ఆర్ధిక కులగణన సర్వేలో ఏ వర్గం చేతిలో ఎంత శాతం భూమి ఉందనే వివరాలు వెల్లడించారు. రాజకీయంగా, ఆర్ధికంగా ఉమ్మడి జిల్లా పైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న రెడ్డి, కమ్మ, ఇతర అగ్రవర్ణాలే లక్షల ఎకరాల సాగుభూమి కలిగి ఉన్నారు. సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారు 12 లక్షల ఎకరాల సాగుభూమి లో, 35–45 శాతం భూమి అగ్రవర్ణాల వద్దే కేంద్రీకృతమైంది. జిల్లా జనాభా 38.9 లక్షల్లో ఓసీలు 15 శాతం మాత్రమే, కానీ 5.4 లక్షల ఎకరాల సాగు భూమి ఆ వర్గాల చేతుల్లో ఉంది. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు సాగు భూమిలో 30-40శాతం వాటానే కలిగి ఉన్నారు. అంటే 3.6 లక్షల నుంచి 4.8 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది.

ఉమ్మడి జిల్లా జనాభాలో మొదటి స్థానంలో ఉన్న ఎస్సీ మాదిగలు, మాలలకు సాగు భూమిలో పూర్తిగా వెనకబడ్డారు. ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో పేద, నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు మాత్రమే వాళ్ల చేతుల్లో ఉన్నాయి. ఎస్టీలతో పోలిస్తే ఎస్సీలకే సాగుభూములు తక్కువ ఉండటం గమనార్హం. 20 శాతం ఎస్సీ జనాభా ఉన్న ఉమ్మడి జిల్లాలో 5-10శాతం భూములు మాత్రమే ఉన్నాయి. అంటే కేవలం 0.6 లక్షల ఎకరాల నుంచి 1.2 లక్షల ఎకరాలు సాగుభూమి మాత్రమే ఉంది. గిరిజన ప్రభావిత ప్రాంతాల్లో ఎస్టీలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఏరియాల్లోనే ఎస్టీల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్లు ముందునుంచే సాగుభూముల పైనే దృష్టి పెట్టారు. జిల్లాలో ఎస్టీల జనాభా 12-14 శాతమే అయినప్పటికీ సాగుభూమిలో ఆ వర్గం వాటా 10-15 శాతం ఉంది. అంటే 1.2 లక్షల నుంచి 1.8 లక్షల ఎకరాల సాగుభూమి ఎస్టీల చేతుల్లో ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ఏరియాలో అగ్రవర్ణాలు అత్యధికంగా సాగుభూములు కలిగి ఉన్నారు. ఈ ఏరియాలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో పెద్దపెద్ద కమతాలు కలిగిన భూములు రెడ్ల ఆధీనంలోనే ఉన్నాయి. సర్వే ప్రకారం ఓసీల భూములు మిర్యాలగూడెం, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. బీసీ రైతులు నల్లగొండ, సూర్యాపేట, నకిరేకల్లో ఉన్నారు. ఎస్టీలు రెండు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని సాగర్, దేవరకొండలో ఎస్టీ జనాభా ఎక్కువ. దాంతో ఈ ప్రాంతంలోనే వాళ్లకు సాగు భూములు ఉన్నాయి. ఎస్సీల జనాభా ఎక్కువగా ఉన్న తుంగతుర్తిలో వాళ్లకు భూములు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

ఉమ్మడి జిల్లా జనాభాలో బీసీలదే అగ్రస్థానం అయినప్పటికీ ప్రధానంగా మూడు కులాలే వ్యవసాయం చేస్తున్నాయి. ఈ మూడు కులాల చేతుల్లోనే సాగు భూములు ఉండటం గమనార్హం. మొత్తం 12 లక్షల ఎకరాల్లో 75 నుంచి 80 శాతం చిన్న, సన్న కారు రైతులే ఉన్నారు, కానీ భూమి మా త్రం 55-60శాతం సన్నకారు, పెద్ద రైతుల చేతుల్లోనే ఉంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నల్లగొండలో ముదిరాజ్, యాదవుల చేతుల్లోనే సాగు భూములు ఉండగా, చిన్న కారు రైతుల్లో ఎస్సీలు ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులే ఇక్కడ ఎక్కువ. మిర్యాలగూడలో సాగునీటి వనరుల లభ్యత ఎక్కువగా ఉన్నందున ఇక్కడ రెడ్లుతోపాటు, బీసీల్లోనే సన్నకారు రైతుల ఆధీనంలోనే సాగుభూములు ఉన్నాయి. నాగార్జునసాగర్ లో ఎస్టీ, ఎస్సీలు పట్టా భూములతోపాటు, అసైన్డ్ భూములు కలిగి ఉన్నారు. ఎస్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దేవరకొండలో భూముల కమతాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. నకిరేకల్లో మున్నూరు కాపు, యాదవ, గౌడ కులాలతోపాటు, ఇతర కులాలు సాగు భూములు కలిగి ఉన్నారు. మునుగోడులో రెడ్లు, బీసీలు, ఇతర పెద్ద కులాలు, భువనగిరిలో మున్నూరు కాపు, యాదవ, చిన్న కారు రైతులు, ఆలేరులో బీసీలు, దాంట్లో చిన్న కారు రైతుల ఆధీనంలో సాగుభూములు ఉన్నాయి. తుంగతుర్తిలో అసైన్డ్ భూములు ఎక్కువ, ఇవన్నీ ఎస్సీలు సాగుచేసుకుంటున్నారు. సూర్యాపేటలో ముదిరాజ్, యాదవ, రెడ్లు, కోదాడలో రెడ్ల చేతుల్లో అత్యధిక భూములు ఉన్నాయి. నీటి వనరుల లభ్యత ఎక్కువ ఉన్నందున పెద్దపెద్ద కమతాలు విస్తరించి ఉన్నాయి. దాంతో వాణిజ్య పంటల సాగు చేయడం పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. హుజూర్నగర్ లో రెడ్డి, బీసీల చేతుల్లోనే సాగు భూములు ఉండగా, వ్యాపారం, వ్యవసాయం పరంగా ఈ ప్రాంతం లో భూముల రేట్ల విలువ కూడా ఎక్కువే.

వర్గంజనాభా (%)భూమి వాటా (%)ఎకరాలు (Approx)
BC50%30–40%1.8 – 2.4 లక్షలు
OC15%35–45%2.1 – 2.7 లక్షలు
SC20%5–10%0.3 – 0.6 లక్షలు
ST15%10–15%0.6 – 0.9 లక్షలు
వర్గంజనాభా (%)భూమి వాటా (%)ఎకరాలు (Approx)
BC52%30–38%0.9 – 1.2 లక్షలు
OC15%35–45%1.0 – 1.3 లక్షలు
SC20%5–10%0.15 – 0.3 లక్షలు
ST10–12%8–12%0.25 – 0.4 లక్షలు
వర్గంజనాభా (%)భూమి వాటా (%)ఎకరాలు (Approx)
BC50%32–40%1.0 – 1.3 లక్షలు
OC15%35–45%1.1 – 1.4 లక్షలు
SC20%5–10%0.2 – 0.4 లక్షలు
ST12–14%10–15%0.4 – 0.6 లక్షలు
వర్గంజనాభా (%)భూమి వాటా (%)ఎకరాలు (Approx)
BC50%30–40%3.6 – 4.8 లక్షలు
OC15%35–45%4.2 – 5.4 లక్షలు
SC20%5–10%0.6 – 1.2 లక్షలు
ST12–14%10–15%1.2 – 1.8 లక్షలు
Share
Share