అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటు అభినందనీయం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఏపీబీ న్యూస్: అత్యాధునిక యంత్రాలతో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా నల్లగొండ నగరంలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని ఆర్టీసీ బస్ డిపో వెనక గల విద్యానగర్ కాలనీ బోయవాడలో నూతనంగా నిర్మించిన సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మేయర్ బుర్రి చైతన్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెంటిలేటర్తో పాటు, క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల ఆసుపత్రి మేనేజ్మెంట్కు అభినందనలు తెలిపారు. డయాలసిస్ సేవలు కూడా ప్రారంభించడం వల్ల రోగులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆసుపత్రి నిర్వహణలో, ఆరోగ్య శ్రీ అమలు లో ప్రభుత్వంతో పాటు, తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చే వారిని ముందుగా డబ్బులు అడగకుండా వైద్యం అందించాలని కోరారు. వైద్య సేవలకు వచ్చే వారిని ముందుగా డబ్బులు అడగకుండా వైద్యం అందించాలని సూచించారు. గతంలో హైదరాబాద్లో డబ్బులు ఇస్తే తప్పా వైద్యం చేయని ఆసుపత్రులను చూశానని, అలాంటి పరిస్థితులు నల్లగొండలో రావొద్దని, అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు. ఆర్ఎంపీ(RMP)లు చెప్పారని వైద్యం రోగులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అత్యాధునిక వైద్య సేవలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, సిటీలో కూడా ఇవే వైద్య సేవలు ఉన్నాయని ఒకరు చెప్పారని నమ్మి మోసపోవద్దని మంత్రి తెలిపారు.

ఆసుపత్రి ఎండీ డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, డాక్టర్ దివ్యలు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా పది పడకల సామర్ధ్యంతో పట్టణంలో సాయి నైసా ఆసుపత్రి నడిపిస్తున్నామని, అందరి సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో 50 పడకల ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పోరేటర్లు అబ్బగోని కవిత, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మిర్యాల యాదగిరి, రేగెట్ట మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share
Share