Breaking News: బస్సు తగలబడుతుంటే.. ఆమె ధైర్యమో.. అమాయకత్వమో: ‘చెప్పుల’ కోసం మంటల్లోకి!

విజయవాడ, ఏపీబీ న్యూస్: విజయవాడ బస్టాండ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సులో భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుండి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్’ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెల్లవారుజామున బస్సు విజయవాడ బస్టాండ్ దగ్గరకు రాగానే ఇంజిన్ భాగం నుండి పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే బస్సును నిలిపివేశాడు.

ప్రయాణికుల అప్రమత్తత: ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వ్యాపించకముందే అందరూ వేగంగా కిందకు దిగిపోయారు.

షార్ట్ సర్క్యూట్ కారణం: సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగుతున్నాయని తెలిసి అందరూ ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటే, ఒక మహిళ మాత్రం తన చెప్పులు బస్సులోనే మర్చిపోయానని తిరిగి లోపలికి వెళ్ళింది. చుట్టూ ఉన్నవారు వద్దు అని వారుస్తున్నా వినకుండా, మంటల మధ్య నుండే తన చెప్పులను తెచ్చుకుంది. ప్రాణం కంటే చెప్పులు ముఖ్యామా? అంటూ అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తరచూ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగడం ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మెయింటెనెన్స్ లోపం వల్ల 35 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇక ఆ మహిళ చేసిన పని విషయానికి వస్తే, అది ధైర్యం కాదు.. అత్యంత ప్రమాదకరమైన సాహసం. అగ్నిప్రమాదం జరిగినప్పుడు సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపిస్తాయి, పొగ వల్ల ఊపిరి ఆడదు. అలాంటి సమయంలో చిన్న వస్తువుల కోసం మళ్ళీ లోపలికి వెళ్లడం ఆత్మహత్యాసదృశ్యమే. ప్రయాణికులు ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించడం అత్యవసరం.

Share
Share