Budget 2026: కార్పొరేషన్ తొలి బడ్జెట్ 281.46 కోట్లతో ఆమోదం

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ 281.46 కోట్ల రూపాయలతో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టడంతో బడ్జెట్ సమావేశంలో కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ లో సమావేశం మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ బడ్జెట్ లో పన్నుల రాబడి ద్వారా 30.24 కోట్లు, పన్నేతర రాబడి ద్వారా 27.37 కోట్లు, అసైన్డ్ ద్వారా 12 కోట్లు, గత సంవత్సరం మిగులు బడ్జెట్ 9.32 కోట్ల రూపాయలు కాగా ఉద్యోగుల జీతభత్యాలు 20 కోట్ల 26 లక్షలు, పారిశుధ్య నిర్వహణకు 5.75 కోట్లు, విద్యుత్ బిల్లులకు 7.2 కోట్లు, హరితహారం కార్యక్రమాలకు 6.97 కోట్లు కేటాయించారు. ఖర్చుల కింద 40 కోట్లు, పరిపాలన ఇతర నిర్వహణ ఖర్చులకు 9.85 కోట్లు కేటాయించారు.

విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలు, బలహీన వర్గాలు మైనార్టీలు నివసించే ప్రాంతాలు అదేవిధంగా మురికివాడల మౌలిక వసతుల కోసం 6.49 కోట్లు కేటాయించారు. పార్కులు, వైకుంఠ ధామాలు, మరుగుదొడ్లు ఇతర అభివృద్ధికి 2.35 కోట్లు కేటాయించారు. వివిధ డివిజన్లో అభివృద్ధి పనుల నిమిత్తం 18.45 కోట్లు తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇతర పథకాల రూపంలో వచ్చే 203 కోట్ల రూపాయలతో అంచనా వ్యయం తో 281.46 కోట్లతో కార్పొరేషన్ బడ్జెట్ను ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు ఈ బడ్జెట్ కూడా దోహదపడుతుందని తెలిపారు.

నల్గొండ పట్టణంలో రాజకీయాలకి అతీతంగా అన్ని డివిజన్లను సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ నగరంలోని ఇందిరమ్మ విగ్రహం నుండి సవార్క నగర్ రామగిరి క్లాక్ టవర్ మీదుగా డీఈఓ కార్యాలయం వరకు 14.45 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులకు ఆమోదం రావడం శుభ పరిణామం అని తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కు హడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేయడం జరిగిందని ఈ ఒప్పందం ద్వారా నిధులను సేకరించి పెద్ద ఎత్తున మౌలిక వసతుల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ చర్లపల్లి గ్రామంలో హిందూ స్మశాన వాటికలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్స్టేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తీయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే దాన్ని పూర్తి చేయాలని తెలిపారు. 24 వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ లో జరిగిన కొన్ని అవకతవకలను పునర్పరచిన చేయాలని సూచించారు.10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు మాట్లాడుతూ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని వెంటనే పనులు పూర్తి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ ఆలీ, కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, పేర్ల మల్లేశ్వరి అశోక్, రత్నవరం తారకమ్మ శ్రీనివాస్, ఎండి ఇబ్రహీం, ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, రేగటి అండాలు లింగస్వామి, దాసరి సాయికుమార్, ఆలకుంట్ల ఝాన్సీ నారతం రాజు, కేసాని వేణుగోపాల్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మి, యామ కవిత దయాకర్, పున్న జ్ఞానేశ్వరి గణేష్, బొజ్జ శంకర్ తదితరులు ఉన్నారు.

Share
Share