Breaking News: Dial 100 స్పందించలేదు… 108 ఆలస్యం: 13 ప్రాణాలు బూడిదయ్యాయి

మార్కాపురం, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం సంభవించింది. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని బలంగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టడంతో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు బస్సు డ్రైవర్లు, క్లీనర్ కూడా ఉన్నట్లు సమాచారం.

జగిత్యాల నుండి నెల్లూరు జిల్లా కలిగిరి వైపు వెళ్తున్న హరికృష్ణట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (సెమీ స్లీపర్), తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు ట్రావెల్స్ యాజమాన్యం విడుదల చేసిన ప్యాసింజర్ లిస్ట్ ద్వారా తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు సెమీ స్లీపర్ కావడంతో పాటు, ప్రమాద ధాటికి ప్రధాన ద్వారం (Door) జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చేందుకు మార్గం లేక హాహాకారాలు చేశారు. కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలను బద్దలు కొట్టి ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారు మంటల్లో చిక్కుకుపోయారు. మృతులు సిఎస్ పురం, కలిగిరి ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వద్ద బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ అత్యవసర సేవల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ప్రమాదం జరిగిన వెంటనే 100 నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. ఇక 108 నెంబర్కి కనీసం 20 సార్లు ఫోన్ చేశాక చివరిలో ఎత్తారు. అప్పటికే బస్సు అంతా కాలిపోయింది, మనుషులు బొగ్గులయ్యారు” అని ఒక బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు.

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. డ్రైవర్ల అతివేగం, నిద్రలేమి, మరియు బస్సుల్లో కనీస అగ్నిమాపక పరికరాలు లేకపోవడం ప్రాణనష్టానికి ప్రధాన కారణమవుతున్నాయి. మార్కాపురం ఘటనలో ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన మొదటి గంట) లో సహాయక చర్యలు అందకపోవడం అత్యంత విచారకరం. 100, 108 వంటి అత్యవసర సేవలు సకాలంలో స్పందించకపోవడంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఏపీబీ న్యూస్ డిమాండ్ చేస్తోంది.

Share
Share