APB News Exclusive: అయ్యో.. ! లతీఫ్ సాబ్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలో రూ.140 కోట్లతో లతీఫ్ సాబ్ గుట్ట పైన నిర్మిస్తన్న ఘాట్ రోడ్డు వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గుట్టను అడ్డం పెట్టుకుని పలువురు లీడర్లు ఆడుతున్న హైడ్రామా సరికొత్త వివాదానికి తెరతీసింది. వక్ఫ్బోర్డు ఎన్ఓసీ (నోఆభ్జక్షన్) ఇవ్వలేదని, కానీ గుట్ట పైన రోడ్డు తవ్వకాలు మాత్రం యథేచ్చగా సాగి పోతున్నాయని దాంతో వందల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద ప్రార్ధనలు చేయడానికి వచ్చిన మత పెద్దలతో పలువురు మైనార్టీ లీడర్లు ఇదే విషయం గురించి లెవనెత్తారు. గతేడాది జులై లో మొదలైన గుట్ట వివాదం ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం వెనక రాజకీయ కోణం దాగి ఉందని, పలువురు రాజకీయ లబ్ధి ఆశించి దీన్ని రాద్దాంతం చేస్తున్నారని మైనార్టీలోని మరో వర్గం మండిపడుతోంది. వక్ఫ్ భూముల నుంచి రోడ్డు వేసేందుకు ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం పట్ల గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బోర్డు ఎన్ఓసీ(NOC) ఇచ్చేందుకు తిరస్కరించింది. అయితే వక్ఫ్ చట్టం ప్రకారం ప్రజాప్రయోజనాలు ఆశించి భూములు ఇవ్వొచ్చనే నిబంధన మేరకు గుట్ట మార్గంలో కోల్పోతున్న 7 ఎకరాలకు బదులుగా అప్పటి కలెక్టర్ ఇలా త్రిపాఠి అమ్మగూడెం రెవిన్యూ పరిధిలోని సర్వే నంబరు 33లో ఏడెకరాలు కేటాయించారు. కానీ బోర్డు ఇప్పటి వరకు పొజిషిన్ తీసుకోలేదు. కేటాయించిన భూములను పరిశీలించిన బోర్డు అధికారులు పలు అభ్యంతరాలు లేవనెత్తినట్టు తెలిసింది. ఆ సమస్యను పరిష్కరించాల్సిన నల్లగొండ జిల్లా వక్ఫ్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. అమ్మగూడెం భూముల విషయంలో రాజకీయ కోణం దాగి ఉందని దాంతోనే జిల్లా అధికారులు సమస్యను మరింత జఠిలం చేశారని తెలుస్తోంది. దీంతో అప్పుడు భూముల కోసం పోరాడిన మైనార్టీ నేతలే మళ్లీ న్యాయ పోరాటం చేయాలనే ఆలోచిస్తున్నారు.

లతీఫుల్లా శాఖాద్రి పేరు మీద ఉన్న ఆస్తులు వక్ఫ్బోర్డుకు 1990 లో సంక్రమించాయి. సర్వే నంబర్లు 59,62,68,70,770,772,774,780లలో 536 ఎకరాలు వక్ఫ్ పరిధిలోకి వచ్చాయి. ఈ సర్వే నంబర్లలో 771,772,779,780లో ఘాట్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. గతేడాది వివాదం నేపథ్యంలో గుట్టకు నలువైపులా వక్ఫ్, రెవిన్యూ డిపార్ట్మెంట్స్ జాయింట్ సర్వే చేసి 525 ఎకరాలు తేల్చారు. రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో గుట్ట పైన ఉన్న వక్ఫ్భూములు ఆక్రమణకు గురివుతున్నాయని, ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు జరుపుతున్నారని మైనార్టీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోందని, దీని పైన సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు.

నల్గొండ లో లతీఫ్ సాబ్ గుట్ట పైన జరుగుతున్న పనులు

ఘాట్ రోడ్డు నిర్మాణం అడ్డంకులు తొలగించే క్రమంలో మైనార్టీలకు కొన్ని హామీలు కూడా ఇచ్చారు. గుట్టను ఆనుకుని కేటాయించిన 26 ఎకరాల్లో 12 ఎకరాలు కబరస్థాన్, 14 ఎకరాలు పేద ముస్లింలకు ఇళ్ల జాగలు ఇస్తామని హామీ ఇచ్చారు. కబరస్థాన్ జాగకు నలు వైపులా ప్రహారిగోడ నిర్మిస్తామని చెప్పారు. కలెక్టరేట్కు సమీపంలో పది లక్షలతో షాదీఖానా, ఈద్గా విస్తరణ చేస్తామని హామీ ఇచ్చారు. వీటిల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ఇదే గుట్టను అడ్డంపెట్టుకుని పలువురు లీడర్లకు మాత్రం పదవులు పొందారు. ఇప్పుడు ఆ లీడర్లనే మైనార్టీ ప్రజలు నిలదీస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఆయాచిత లబ్ధిపొందారని, దాంతోనే సమస్యల పైన నోరు మెదపడం లేదని ఫైర్ అవుతున్నారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని లీడర్లు చెప్తున్నప్పటికీ ఆ వర్గం ప్రజల్లో నమ్మకం కలగట్లేదు.

కభరస్థాన్ కు కేటాయించిన స్థలం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వక్ఫ్ భూములు కాపాడేందుకు బోర్డు నుంచి ఒకే ఒక్క ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. గత ఏడేళ్ల నుంచి అతను ఇక్కడే పాతుకునిపోవడంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయని మైనార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్భూముల్లో లోటు పాట్లను అడ్డంపెట్టుకుని ఏళ్ల తరబడి పబ్బం గడుపుకుంటున్నారని చెప్తున్నారు. ఇతని నిర్వాహకం పైన ఇప్పటికే బోర్డు అధికారులకు, సీఎం స్థాయిలో కూడా ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ సైతం ఇన్స్పెక్టర్ పైన మండి పడ్డారు. నల్లగొండలో వక్ఫ్ మడిగల రెంట్లు వసూలు చేయకపోవడం, గుట్ట ఆక్రమణల పైన కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. దీని పైన సమగ్ర నివేధికతో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించిన పట్టించుకోలేదు. దీంతో సోమవారం గ్రీవెన్స్ రోజున కలెక్టర్ ఇన్స్పెక్టర్ పైన ఆగ్ర హం వ్యక్తం చేశాడని, వీలైనంత త్వరగా నివేధిక ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది.

ఘాట్ రోడ్డు వద్ద వక్ఫ్భూములు కోల్పోతున్న దానికి బదులు అమ్మగూడెం రెవిన్యూలో 7 ఎకరాలు కేటాయించినం, కానీ పొజిషన్ తీసుకోవాల్సిన బాధ్యత వక్ఫ్బోర్డుది. పనులు సాఫీగా సాగుతున్నాయి. అక్కడ ఏమైనా ఆక్రమణలు జరిగాయని తెలిస్తే వాటి పైన వక్ఫ్ బోర్డు సర్వే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తాం.

అమ్మగూడెం వద్ద కేటాయించిన 7 ఎకరాలు ఇంకా పొజిషన్ తీసు కోలేదు. వక్ఫ్బోర్డుకు ప్రతిపాధనలు వెళ్లాయి. అక్కడి నుంచి నిర్ణ యం తీసుకోవాలి. గుట్ట పైన జరుగుతున్న రోడ్డు పనుల్లో భూము లు ఆక్రమణకు గురివుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. వాటి పైన త్వరలోనే చర్యలు చేపడ్తాం.

Share
Share