- కార్పోరేషన్ ఎన్నికల్లో హమీ మేరకు ప్రకాశం బజార్లో డివైడర్లు నేలమట్టం చేసిన మంత్రి
- అదే స్పూర్తిని డివిజన్ కార్పొరేటర్లు కొనసాగిస్తారా..?
- వీధుల్లో ఆనవాళ్లు కోల్పోయిన సిమెంట్ రోడ్లు
- వీధుల్లో, రోడ్ల పక్కన నాలాలు, ఫుట్పాత్లు కబ్జా
- డబ్బా కొట్లు పెట్టుకునేందుకు లక్షలు వసూళ్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: వచ్చే మూడేళ్లలో నల్లగొండ కార్పోరేషన్ను స్మార్ట్ సిటీగా చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలను కార్పోరేటర్లు సాకారం చేస్తారంటే నమ్మకం కలగడం లేదు. ‘పాత సీసాలో కొత్త సారా’మాదిరి ఇప్పుడున్న కార్పోరేటర్లలో చాలా మంది రెండు, మూడు సార్లు కౌన్సిలర్లుగా గెలిచినోళ్లే ఉండటం వల్ల అనుమానాలకు తావిస్తోంది. తమ భార్యలను, కూతుళ్లను కార్పోరేటర్లుగా చేశామనే ఆనందం పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం రాజకీయ హోదా కోల్పోయామనే బాధతో విలపిస్తున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల్లో ఫోటోలు పెట్టడం లేదని, గతంలో ఉన్నంత మర్యాద ఇప్పుడు ఇస్తలేరని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశ్ బజార్తో మంత్రికి మైలేజ్…
స్మార్ట్ సీటీ చేయాలనే లక్ష్యంతో కార్పోరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవకముందే మంత్రి కోమటిరెడ్డి ప్రకాశం బజార్లోని డివైడర్లను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం లో భాగంగా వ్యాపారులకు ఇచ్చిన హామీ మేరకు డివైడర్లతో సహా, వాటి పైన నిర్మించిన ఆక్రమణలు అన్నింటిని నామరూపాల్లేకుండా చేశారు. గతంలో ఇవే ఆక్రమణలు తొలగించేందుకు అడ్డుపడ్డ మైనార్టీ నాయకులకు సైతం సర్ధిచెప్పి ఒప్పించకలిగారు. దీంతో ఇప్పుడు ప్రకాశం బజార్ ప్రాంతం కళకళాడుతోంది. వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. వ్యాపారాలు సజావుగా నడుస్తున్నాయి. దీంతో మంత్రి కోమటిరెడ్డి గ్రాఫ్ పట్టణంలో అమాంతంగా పెరిగింది. ఇచ్చిన హామీ మేరకు మంత్రి చేపట్టిన చర్యలు ఇదే స్పీడ్లో కొనసాగిస్తే స్మార్ట్ సిటీ ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ధ్వంసమైన వీధుల్లో రోడ్లు…
పట్టణంలోని చాల కాలనీల్లోని వీధుల్లో కొన్నేళ్ల కిందట వేసిన సిమెంట్ రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇది చాలదన్నట్టుగా రోడ్లకు ఇరు వైపుల నిర్మించిన నాలాలు సైతం ఆక్రమణలకు గురియ్యాయి. మంత్రి కోమటి రెడ్డి క్యాంపు ఆఫీసు ఉండే శ్రీనగర్ కాలనీలోని రోడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. గత బీఆర్ఎస్ హాయంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడి వేసిన రోడ్లు ఆనవాళ్లు కోల్పోయాయి. వీటి స్థానంలో కొత్త రోడ్లు వేస్తామని చెప్పిన అధికారులు దాటవేశారు. కార్పేషన్ ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం అవసరం లేని చోట కూడా రోడ్లు నిర్మించి లక్షలు దండుకున్నారు. మంజూరు చేసిన ప్రధాన రోడ్లను వదిలేసి మురికి కాల్వల పైన రోడ్లు నిర్మించి కాసులు దండుకున్నారు. దీంతో ఇప్పుడా ప్రాంతంలో కార్లు, బైక్లు ఓవర్ స్పీడ్తో వెళ్తుండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

డబ్బా కొట్లతో నాలాలు కబ్జా….
ప్రధాన రహాదారుల పైన ఫుట్పాత్లు సైతం కబ్జాకు గురియ్యాయి. క్లాక్ టవర్ నుంచి ఎన్జీ(NG) కాలేజీ వరకు, క్లాక్ టవర్ నుంచి డీఈఓ(DEO) ఆపీసు, ఆర్టీసీ బస్టాండ్, గవర్నమెంట్ ఆసుపత్రి ఏరియాలో ఫుట్పాత్ లు కబ్జా చేశారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేసేందుకు తొలగించిన చిరువ్యాపారులు ఫుట్పాత్లు కబ్జా చేశారు. ఇది చాలదన్నట్టుగా అప్పుడున్న కౌన్సిలర్లు తమ వార్డుల్లో ఎక్కడపడితే అక్కడ డబ్బా కొట్లు పెట్టుకునేందుకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారు. ఒక్కో డబ్బాకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వీటీ థియేటర్ సమీపంలో డబ్బాలను తొలగించే ప్రయత్నం చేశారు, కానీ రాజకీయంగా సమస్యలు తలెత్తడంతో మధ్యలోనే ఆపేశారు. నల్లగొండ ట్రాఫిక్ అంతరాయానికి ప్రధాన కారణమైన ఆక్రమణలు తొలగిస్తే తప్పా స్మార్ట్ సిటీ వాతావరణం కనిపించదు. పట్టణంలో చిరువ్యాపారుల కోసం కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన షెడ్లు, ఫుడ్ కోర్టులు, మార్కెట్ యార్డ్లు వృథాగా పడి ఉన్నాయి.
ప్యాకేజీ టెండర్లకు కార్పోరేటర్లు ఒప్పుకునేనా..?
పదివేల కోసం కూడా కక్కుర్తి పడే కార్పోరేటర్లు కొందరు ఉన్నారని, వాళ్లను గాడిలో పెడితే అన్ని సర్ధుకుంటాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పార్టీలు మారిన ప్రతిసారి లక్షలు దండుకున్న కార్పోరేటర్లు మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం ఒక్కక్కరికి రూ.15లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ముట్టజెప్పారు. మేయర్ ఎన్నికప్పుడు అధనంగా మరో రూ.5 లక్షలు గుడ్విల్ ఇచ్చారు. మొత్తంగా ఎన్నికల ఖర్చు రూ.15 కోట్లు దాటింది. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కార్పోరేటర్లు ఇంకా టెండర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు మాత్రం రూ.5, 10 లక్షలు టెండర్లు కాకుండా ప్యాకేజీ టెండర్లు పిలవాలనే ఆలోచన చేస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టర్ల వల్ల సమస్యలు వస్తున్నాయని, కమీషన్ల వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తోందని, అలాకాకుండా అన్ని పనులు కలిపి ఒకటే ప్యాకేజీ కింద టెండర్లు పిలిస్తే సమయం కలిస్తొదని, పనుల పర్యవేక్షణ కూడా సులభంగా ఉంటదని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రాథమిక చర్చల దశలో ఉన్న ఈ ప్రయత్నాన్ని అప్పుడే కొందరు కార్పోరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు సైతం డబ్బులు ఖర్చు పెట్టారని, అంతమాత్రాన ఎన్నికల ఖర్చులకు, మున్సిపల్ వర్క్లకు ముడిపెట్టొద్దని, ఎవరి వాటా వాళ్లకు ఇవ్వాల్సిందేనని పట్టు బడుతున్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి ఆశయానికి కార్పోరేటర్లు తూట్లు పొడిచే ప్రయత్నం అప్పుడే మొదలు పెట్టారనే వాధన విని పిస్తోంది.