సూర్యాపేట, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్టానం, అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడింది. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలోని కౌన్సిలర్ అభ్యర్థులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో రహస్య ప్రాంతానికి తరలించారు.
హైదరాబాద్ శివార్లలో ‘క్యాంప్’ రాజకీయం
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సుమారు 43 మంది అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రైవేట్ ఫామ్హౌస్కు తరలించినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులు జరగకుండా మరియు ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల ఒకరిద్దరు అభ్యర్థులు మినహా, మిగిలిన వారందరినీ బస్సుల్లో క్యాంపుకు పంపారు.
హైకమాండ్ సీరియస్ ఆదేశాలు కేవలం సూర్యాపేట మాత్రమే కాకుండా, హోరాహోరీ పోరు సాగిన నల్లగొండ, మిర్యాలగూడ, చండూరు మున్సిపాలిటీల్లోని అభ్యర్థులను కూడా తక్షణమే క్యాంపులకు తరలించాలని పార్టీ హైకమాండ్ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలకు చిక్కకుండా కౌన్సిలర్లను కాపాడుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు దృష్టి సారించాయి.