Breaking News: చిట్యాల పోరులో… కోమటిరెడ్డి​ బ్రాండ్​ గల్లంతు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కోమటరెడ్డి బ్రదర్స్ వర్గీయుల అడ్రస్ గల్లతైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఎంట్రీతో చిట్యాల పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే వేముల వీరేశం, అమిత్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో బ్రదర్స్ బ్రాండ్ కనుమరుగైంది. పురపోరు తుది అంకానికి చేరుకున్న తరుణంలో బ్రదర్స్ వర్గీయులు, అమిత్ వర్గానికి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. చిట్యాల ఎన్నికల ఇంచార్జి అమిత్రెడ్డి వ్యవహారిస్తారని ఎమ్మెల్యే వీరేశం ప్రకటించినప్పటి నుంచే బ్రదర్స్ వర్గం భగ్గుమంటోంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన బ్రదర్స్ వర్గీయులకు ఈ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా దక్కకుండా పక్కాగా స్కెచ్ వేశారు. బ్రదర్స్తో కనీసం చర్చకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా అమిత్ను ఎన్నికల ఇంచార్జిగా ప్రకటించడం, అభ్యర్థుల ఎంపిక కోసం సొంతంగా సర్వేలు చేయడం, ఎన్నికల ఖర్చు ఒప్పందాలు అన్నీ శరవేగంగా జరిగిపోయాయి. వీరేశం, అమిత్ వ్యూహాన్ని పసిగట్టిన కోమటిరెడ్డి వర్గీయులు తమ రాజకీయ మనుగడ ప్రమాదంలో పడుతుందని భయంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద తమగోడును వెళ్లబోసుకున్నారు.

చిట్యాల కాంగ్రెస్లో తమ వర్గానికి నష్టం జరుగుతుందని తెలిసిన రాజగోపాల్ రెడ్డి వీరేశం, అమిత్ చర్యలను తీవ్రంగానే వ్యతిరేకించినట్టు తెలిసింది, ఒకానొక దశలో తనవర్గీయులను సైతం పోటీలో ఉండమని రాజగోపాల్ ప్రోత్సహించారు. దీంతో తనకు చెడ్డపేరు వస్తదనే ఉద్దేశంతో అప్పటి నుంచి అమిత్ తెరవెనకే ఉండి చక్రం తిప్పుతున్నారు. నిజానికి 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే చిట్యాలలో పార్టీని కాపాడేందుకు రాజగోపాల్ తీవ్రంగా శ్రమించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాజగోపాల్ చుక్కలు చూపెట్టారు. నాలుగు వార్డుల్లో కాంగ్రెస్, ఆరింటిలో బీఆర్ఎస్, రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. ఎక్స్ఆఫిషియో సభ్యుల సహకారంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకో వాల్సి వచ్చింది. అప్పుడు కూడా బ్రదర్స్ అండతోనే ఏకగ్రీవంగా ఎన్నికైన కోమటిరెడ్డి చినవెంకటరెడ్డి చైర్మన్ అయ్యారు. అప్పుడు సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వీరేశం, గుత్తా ఒకేపార్టీలో ఉండటంతో చిట్యాలలో తమవర్గాన్ని పైకితె చ్చేందుకు చేతులు కలిపారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గీయుల్లో ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదు. చివరకు మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకటరెడ్డిని సైతం సీన్లో లేకుండా చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన కొద్దిరోజుల పాటు నల్లగొండ మేయర్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిసింది. చిట్యాల కాంగ్రెస్లో గుత్తా జోక్యం వల్ల బ్రదర్స్ వర్గం తీవ్రంగా నష్టపోయిందని భావించి అటు వైపు కన్నెత్తికూడా చూడలేదు. వారం రోజుల పాటు నల్లగొండ కార్పోరేషన్ ప్రచారానికి వచ్చిన మంత్రి వెంకటరెడ్డి కనీసం చిట్యాల ప్రచారంలో పాల్గొనకపోవడంతో ఆయన వర్గీయులు సైతం సైలెంటయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కోసం శ్రమించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా తన వర్గాన్ని కాపాడుకోలేకపోవడం పట్ల పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది.

మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళ అయితే ఆర్యవైశ్యులకే ఇవ్వాలని చిట్యాలలో ఆవర్గం పట్టుబట్టింది. వైశ్యులు మొదటి నుంచి గుత్తా వర్గీయులే కావడంతో ఒప్పందం మేరకు ఆవర్గానికే చైర్మన్ పీఠం ఒప్పుకున్నారు. గుత్తా అత్యంత సన్నిహితుడు వనమా వెంకటేశ్వర్లుతో సహా, పట్టణంలోని వైశ్యులు అంతా ఏకమై జోరుగా ప్రచారం చేశారు. అయితే ముందు నుంచీ కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గాని కి చెందిన మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకటరెడ్డి చైర్మన్ పదవి ఆశించారు, కానీ గుత్తా ఎంట్రీతో మాజీ చైర్మన్కు అవకాశం చేజారి పోయింది. ఆయన్ని బుజ్జగించేందుకు అతని అనుచరుల్లో ఒక్కరికి అవకాశం ఇచ్చారు. మిగిలిన వార్డుల్లో గుత్తా అమిత్, వీరేశం వర్గీయులే పోటీలో ఉన్నారు.

Share
Share